పుట:Andhra bhasha charitramu part 1.pdf/765

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఉదా. కణేహతముగ పాలుత్రాగుచున్నాడు; ఘనోహాతముగ పాలుత్రాగుచున్నాడు.

'పురస్‌' అనున దవ్యయమయి క్రియతో గూడినప్పుడు గతి సంజ్ఞను బొందును: ఉదా. పురస్కృతము.

'అస్తం' అను పదమవ్యయమగునపుడు క్రియాపదముతో సమసించి గతిసంజ్ఞకమగును: సూర్యు డస్తంగతు డయ్యెను.

'ముందు', 'ఎదుట' అను నర్థములుగల 'అచ్ఛ' అను నవ్యయము 'గతి' అను నర్థముగల క్రియలతోను, 'సద్‌' అను ధాతురూపముతోడను సమసించి గతిసంజ్ఞకమగును: ఉదా. అచ్ఛగతి, అచ్ఛోద్యము.

ఒక క్రియాపదముతో గలిసి మఱియొకని కుపదేశమును చూపించుట అను నర్థము లేనప్పుడు 'అదస్‌' అను పదమునకు 'గతి' యను సంజ్ఞ కలుగును: ఉదా. అద:కృతము.

'తిరస్‌' అను పదము 'కనబడకుండుట' అను నర్థమున గ్రియతో గలిసి గతిసంజ్ఞను పొందును: ఉదా. తిరోధానము, తిరోభూతము.

'బలహీనులకు సహాయముచేయు' అను నర్థముగల 'ఉపాజే, అన్వాజే' అను పదములు 'కృత' = చేయు అనుధాతువుతో జేరి వైకల్పికముగా గతిసంజ్ఞను పొందును: ఉదా. ఉపాజేక్ర్తము, అన్వాజేకృతము.

'సాక్షాత్‌' మొదలగు పదములు 'కృ' = చేయు ధాతువుతోజేరి వైకల్పికముగా గతిసంజ్ఞను బొందును: ఉదా. సాక్షాత్కారము.

ఉరసి, మనసి, అను పదములు కృ =చేయు, అను ధాతువు పరమగునపుడు 'ఉంచు' అను నర్థము కలుగకున్నయెడల గతిసంజ్ఞను వైకల్పికముగా బొందును: ఉదా. ఉరసికృతము, మనసికృతము.

'ఉంచు' అను నర్థమును బొందునప్పుడు 'మధ్యే', 'పదే', 'నివచనే' అను పదములును 'కృ'(=చేయు) ధాతువుతోజేరి వైకల్పికముగా గతి సంజ్ఞకము లగును: ఉదా. మధ్యేకృతము, పదేకృతము, నివచనేకృతము.

'పెండ్లి' అను నర్థమున 'హస్తే', 'పాణౌ' అను పదములు కృ(=చేయు) ధాతువుతోజేరి నిత్యముగా గతిసంజ్ఞను బొందును: ఉదా. హస్తేకృతము, పాణౌకృతము.

'ప్రాధ్వమ్‌' అను నవ్యయము 'బంధనము' అను నర్థమున కృ(=చేయు) ధాతువుతో గలిసి నిత్యముగా గతిసంజ్ఞను పొందును: ప్రాధ్వంకృతము.