పుట:Andhra bhasha charitramu part 1.pdf/758

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

హము. తద్ధితార్థద్విగువయినచో నేకవచనమునం దుండదు:పంచక పాలములు = అయిదుకపాలములందు సంస్కరింపబడినవి: పంచగవములు (పటములు) = అయిదు గోవులతో కొనినవి (వస్త్రములు).

ii. కేవల కర్మధారయ సమాసము.

కుత్సితార్థమును దెలియజేయుపదములు కుత్సనార్థకపదములతో సమసించును: ఉదా. వైయాకరణఖసూచి = వ్యాకరణము తెలియక వ్యాకరణ ప్రశ్నము నడిగినప్పుడెల్ల నాకాశమువంక జూచువాడు; మీమాంసకదుర్దురూడుడు = బాగుగ మీమాంసాశాస్త్రమును దెలియనివాడు; యాజ్ఞి కకితవుడు = యజ్ఞముచేయ నర్హులు కానివారికొఱకు యజ్ఞములను జేయించువాడు.

(2) 'పాప,' 'అణక' అనుపదములు కుత్సితార్థకపదములతో సమసించును. ఈ విధి పై సూత్రమున కపవాదము. 'పాప,' 'అణక' శబ్దములు కుత్సనార్థకములు కావున బైసూత్రముప్రకారము సమాసమున నుత్తర పదములు కావలసియుండగా నీ సూత్రమువలన బూర్వపదము లగుచున్నవి: ఉదా. పాపనాపితుడు = దుష్టుడైన మంగలివాడు; అణకకులాలుడు = నీచుడైన కుమ్మరవాడు.

(3) ఉపమానవాచకపదములు సమానధర్మము గలవియై యుపమేయ వాచకపదములతో సమసించును: (కృష్ణుడు) ఘనశ్యాముడు. ఇచట ఘనము (మేఘము)నకును కృష్ణునకును శ్యామత్వము (నలుపుదనము) సమానధర్మ మగుటచే ఘన, శ్యామపదములకు సమాసము కలిగినది. ఇం దుపమాన వాచకమగు 'ఘన'శబ్దము సమాసమున బూర్వపదముగా నున్నది. ఇట్లే, కుముద శ్వేతి, హంసగద్గదము, న్యగ్రోధపరిమండలము మొదలయినవి. ఇట్టి సమాసమునకు విగ్రహము చెప్పునప్పుడు 'ఇవ' = వలె అనుపదము వచ్చును. ఘనశ్యామ: = ఘన ఇవ శ్యామ: ఘనమువలె శ్యామవర్ణము గలవాడు.

(4) ఉపమేయవాచకము 'వ్యాఘ్ర' మొదలగు నుపమానవాచక పదములతో బైసూత్రమునందువలె సమానధర్మము ద్యోతకము కానప్పుడు సమసించును: ఉదా. పురుషవ్యాఘ్రుడు. దీనికి విగ్రహము 'పురుషోయం వ్యాఘ్ర ఇవ' = ఈ పురుషుడు (బలమున) వ్యాఘ్రము వంటివాడు' అని చెప్పవలెను.

వ్యాఘ్ర, సింహ, ఋక్ష, ఋషభ, చందన, వృక, వృష, వరాహ, హస్తిన్, తరు, కుంజర, రురు, పృషతీ, పుండరీక, పలాశ, కితవ - ఇవి వ్యాఘ్రాదులు. ఇది యాకృతిగణము; కావున, ముఖపద్మము, ముఖకమలము, కరకిసలయము, పార్థివచంద్రుడు మొదలగు సమాసములును గలవని తెలియవలెను.