పుట:Andhra bhasha charitramu part 1.pdf/753

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

కర్తవ్యము, స్వశర్తవ్యము మొదలయినవి. సమానాధికరణము, అనగా రెండు పదములును నేకవస్తువును దెలుపునప్పుడు: 'రాజ్ఞ:పాటలీపుత్రకస్య' అనుదానియందు రాజ, పాటలీపుత్రక శబ్దము లేక పురుషుని దెల్పుచున్నవి, కావున 'రాజ పాటలిపుత్రకుడు' అనుసమాసము సిద్ధింపదు. ఇట్లే, పాణిని సూత్రకారుడు, తక్షకతర్పము, అనుసమాసములును సిద్ధింపవు. అయినను 'సూత్రకార ఏవపాణిని:' అను విగ్రహము చొప్పున 'సూత్రకారపాణిని' అను సమాసము నుసంగతమగును.

(5) షష్ఠ్యంతపదము పూజార్థమున క్తాంతపదముతో సమసింపదుపూజార్థమనుటవలన మతి, బుద్ధి, అను నర్థములును ద్యోతకములగును. రాజ్ఞాం మత:, బుద్ధ:, పూజిత:, అను విగ్రహార్థమున 'రాజమత:, రాజబుద్ధ:, రాజపూజిత:' అను సమాసములు కలుగవు. రాజులచేత పూజింపబడువాడు అను తృతీయార్థమున 'రాజపూజితుడు' అను తృతీయాతత్పురుష సమాసమునకు బాధకములేదు.

(6) అధికరణవాచకశబ్దముతో గూడ షష్ఠ్యంతపదము సమసింపదు. ఉదా. ఇదమేషాం వాసితం ( - గతమ్ - భుక్తమ్.)

(7) షష్ఠ్యంతపదమునకు ద్వితీయార్థము కలుగునప్పు డది మఱియొక పదముతో సమసింపదు. ఉదా: 'ఆశ్చర్యో గవాం' దోహో అగోపేన' ఇచట 'గవాం' అను షష్ఠ్యంతపదమునకు ద్వితీయార్థమున్నది గావున 'గోదోహ:' అని సమాసము సిద్దింపదు.

(8) షష్థ్యంతపదము కర్త్రర్థకములగు 'తృచ్‌', 'అక' అనుప్రత్యయములుచేరి యేర్పడిన పదములతో సమసింపదు: ఉదా. 'అపాంస్రష్టా' ('అప్‌స్రష్టా' అని కాదు); వజ్రస్యభర్తా ('వజ్రభర్తా' అనికాదు); ఓదనస్య పాచక: ('ఓదనపాచక:' అనికాదు).

(9) కర్త్రర్థము కలిగిన షష్ఠ్యంతపదము 'అక' ప్రత్యయాంతపదముతో సమసింపదు: ఉదా. భవత: శాయికా ('భవచ్ఛాయికా' అనికాదు).

(10) షష్ఠ్యంతపదము 'క్రీడ, జీవిక' అను నర్థములనిచ్చు 'అక' ప్రత్యయాంతపదముతో తప్పక సమసించి షష్ఠీతత్పురుష సమాసమగును: ఉదా. ఉద్దాలక పుష్పభంజిక = ఒకవిధమగు ఆట. ఈ యాటయం దుద్దాలకపుష్పములను చిదుముదురు; దంతలేఖకుడు = పండ్లకు రంగువేసి జీవించువాడు; నఖలేఖకుడు = గోళ్లకు రంగువేసి జీవించువాడు.

(11) పూర్వ, అపర; అధర, ఉత్తర అను పదములు మొత్తమునుండి ప్రత్యేకించబడిన భాగములుగలిగిన యొకవస్తువును దెలుపుపదముతో