పుట:Andhra bhasha charitramu part 1.pdf/751

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


iii. చతుర్థీ తత్పురుషము.

చతుర్థ్యంతపదము తాదర్థ్యబోధకపదముతోను, అర్థ, బలి, హిత, సుఖ, రక్షిత, శబ్దముతోడను సమసించి చతుర్థీ తత్పురుష సమాసమగును: ఉదా. యూపముకొఱకు దారువు = యూపదారువు; రంధనాయ స్థాలీ = వంట కొఱకుస్థాలి యనుచో తాదర్థ్యములేదు కావున సమాసముకాదు; ద్విజుని కొఱకు ఇది (పప్పు) = ద్విజాఅర్థము; భూతములకొఱకు బలి = భూతబలి; గోవులకొఱకు హితము = గోహితము; గోవులకొఱకు సుఖము = గోసుఖము; గోవులకొఱకు రక్షితము = గోరక్షితము.

iv. పంచమీ తత్పురుషము.

(1) పంచమీ విభక్త్యంతపదము భయశబ్దముతో, వైకల్పికముగా సమసించి పంచమీ తత్పురుష సమాసమగును: ఉదా. చోరునివలన భయము = చోరభయము - భీత, భీతి, భీ శబ్దములతోడను పంచమ్యంతపదము సమసించును: ఉదా. చోరభీతుడు, చోరభీతి, 'భీ' శబ్దముతోడి సమాసము తెనుగున గలుగదు.

(2) పంచమ్యంతపదము అపేత, అపోడ, ముక్త, పతిత, అపత్రస్త, అనుపదములతో సమసించి 'కొంచెము కొంచెముగా' అను నర్థమున పంచమీ తత్పురుష సమాసమగును: ఉదా. సుఖాపేతుడు = సుఖమువలన విడివడినవాడు; కల్పనాపోడుడు = కల్పనవలన తీసికొని పోబడినవాడు; చక్రముక్తుడు = చక్రమునుండి విడిపింపబడినవాడు; స్వర్గపతితుడు = స్వర్గమునుండి పడినవాడు; తరంగాపత్రస్తుడు = తరంగములవలన భయపడినవాడు. 'కొంచెము కొంచెముగా' అనుటవలన 'ప్రాసాదమునుండి పడినవాడు' అనుటకు 'ప్రాసాదపతితుడు' అను సమాసము కాదు.

(3) పంచమ్యంతములైన 'కొంచెము', 'దగ్గఱ' 'దూరము', అనునర్థములుగల పదములును, 'కృచ్ఛ్ర' అనుపదమును క్తాంతపదములతో సమసించి పంచమీ తత్పురుష సమాసము లగును. ఇట్టి సమాసములందు విభక్తిలోపము కలుగదు: ఉదా. స్తోకాన్ముక్తుడు, అల్పాన్ముక్తుడు, అంతికాదాగతుడు, అభ్యాశాదాగతుడు, దూరాదాగతుడు, విప్రకృష్ణాదాగతుడు, కృచ్ఛ్రాదాగతుడు, కృచ్ఛ్రాల్లబ్ధము మొదలయినవి.

v. షష్ఠీతత్పురుషము.

(1) షష్ఠ్యంతమగు పదము సమర్థమగు పదముతో సమసించి షష్ఠీతత్పురుష సమాసమగును: ఉదా> రాజుయొక్క పురుషుడు = రాజపురుషుడు.