పుట:Andhra bhasha charitramu part 1.pdf/740

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

బ్రచారమం దున్నవి. ఆవిధములందయినను దత్తత్సూత్రముల ననుసరించిన కొన్నిసమాసములు మాత్రము తెనుగున నుపయోగింపవచ్చును. అట్టివానినే యితరముల నుపయోగింప వీలులేదు. అట్టి సమాసములు తెనుగున స్థిరపడలేదు. సంస్కృతవ్యాకరణమువలన సాధ్యములగునవి యింతవఱకు దెనుగున స్థిరపడని సమాసములను కల్పించుట సమంజసము కానట్లు తోచుచున్నది. ఈక్రింద సిద్ధసంస్కృత సమాసముల నిష్పత్తివిధానము వివరింపబడుచున్నది. ఆయా స్థలములందు తెనుగున బ్రయోగింపబడని సమాసరూపములును తెలుపబడును.

సంస్కృతమున సమాసము లెన్నివిధము లనువిషయమున ననేకు లనేకవిధములుగ జెప్పియున్నారు. "తత్పురుష, బహువ్రీహి, ద్వంద్వంబులని సమాసంబులెల్లం ద్రివిధంబులై యుండు" నని చిన్నయసూరి యొక యభిప్రాయమును వెల్లడించెను. ఇవిగాక అవ్యయీభావమను నొకసమాసమును గూర్చి సిద్ధాంతకౌముది వివరించుచున్నది. ప్రాదిసమాసములు, ఉపపద సమాసములు మొదలగు మఱికొన్ని సమాసములను గొందఱు ప్రత్యేకించి యున్నారు. "కేవలసమాసము" లను విభాగమును గూడ గొందఱు తెలిపిరి.

I. కేవలసమాసము.

శబ్దములు ప్రత్యేకముగా సుబంతాదులై యుండియు లోపాదులను బొందక యర్థవశమున వాక్యమునందు గలిసియున్నచో నవి కేవలసమాసము లనబడును. ఇట్టివి సమాసము లగునా యనుసందేహ ముదయింపకపోదు. అయినను నిట్టివానినిగూడ సమాసములుగనే కొందఱు పరిగణింతురు. వాగర్థౌ+ఇవ = వాగర్థావివ; జీమూతస్య+ఇవ = జీమూతస్యేవ; మొదలయినవి కేవలసమాసములు.

సమాసమందు సుబంతము సమర్థమగుపదముతో గలియును. ఆ సమర్థమగుపదము సుబంతమయినను కావచ్చును; లేదా, తిజౌదులలో నేదియైన గావచ్చును. సుబంతపదమునకు ధాతువనికాని, ప్రాతిపదికమని కాని సంజ్ఞ కలిగినప్పుడు దానికిజేరిన సుప్ప్రత్యయము లోపించును.

II.అవ్యయీభావము.

అవ్యయము సమర్థమగు పదముతో గలిసి యేర్పడిన సమాసమునకు 'అవ్యయీభావ'మనిపేరు. అవ్యయీభావసమాసములు సాధారణముగ నపుంసకలింగములై యుండును. కావున నవి తెనుగున జేరునప్పుడు సంస్కృత నపుంసకలింగ శబ్దములు తెనుగున దత్సమము లగునప్పుడు వర్తించువిధులు వీనికిని వర్తించును.