పుట:Andhra bhasha charitramu part 1.pdf/728

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


దనియు రామరాజు తిరుమలరాజు ఎదుటికి నైజాంషాహాను ఓడించి పట్టి తెచ్చినందుకు హండే హనుమప్పనాయుని కీగ్రామములతోబాటు ఇయ్యబడినదనియు హండే అనంతపురము చరిత్రలో గలదు.

అనంతపురము (అనంతపురం తా.): బుక్కరాజు మంత్రి అనంతరసు త్రవ్వించిన చెఱువు అనంతసాగరమును బట్టి యీ పేరు వచ్చినది. దీని మొదటి పేరు అనంతసాగరమే. కాని అది బుక్కరాయసముద్రము చెఱువులో చేరి పోయినది. అనంతసాగరము అనంతపురముగా నెప్పుడు మాఱెనో తెలియదు. ప్రకృతమున్న అనంతపురము కొంతకాలముక్రిందట చాల దక్షిణమునకు జరిగినదని తెలియవచ్చుచున్నది.

6. పెనుగొండ: పిల్లలమర్రి పినవీరభద్రుని "జైమినీభారతము"లో సాళువ నరసింహరాజునకు 'పెనుగొండాద్యఖిలైక దుర్గహరణ ప్రేంఖత్ప్రతాపోదయా' 'పెనుగొండ దుర్గహరణ' అను సంబోధనమువలన విశేషణమున్నట్లు తెలియుచున్నది.

'పెనుగొండ సాధిణాహి ... ... విశ్వహితకారి తిమ్మయ యీశ్వరుండు' అని వరాహపురాణమునందు పెనుగొండ ప్రశంస కలదు. 'పెనుగొండ దుర్గసాధకు'డను బిరుదు రామరాయనికిని గలదు. వసుచరిత్రలో నిది గిరీశ శబ్దముచే శ్లేషింపబడినది.

7. గుత్తి: తూర్పునకు గుత్తిమార్గముగా రాజు సైన్యముల నడిపించెనని "రాయవాచకము" నందు గలదు. 'గుత్తిదుర్గనిర్భేదన' అని రామరాయనికి బిరుదమున్నది. కృష్ణదేవరాయని అనంతరము గుత్తి దుర్గపాలకుడు తిరుగుబాటు చేసెనని దీనివలన ఊహింపవచ్చును.

8. బూదికొండ: దీనికి బూదిహాల్ అని మరియొక నామమని అనంతపురంజిల్లా గెజటీయరు తెల్పుచున్నది. ఈ రెండు పేర్లునుగల గ్రామ మేదియు జిల్లాలో నిప్పుడు కనబడదు. 'బూద', 'బూది' తో ప్రారంభమగు నామధేయములు కొన్ని ఉన్నవి. తూర్పు దండయాత్రలో కృష్ణరాయనికి ఈ బూదిహాలుప్రభువు సాహాయ్యముచేసినట్లు "కృష్ణరాయవిజయము" నం దున్నది.

9. దొరెగల్లు (కదిరి తాలూకా): "కృష్ణరాయ విజయములో" నిది 'తొరగల్లు' అని యున్నది. కృష్ణదేవరాయనికి దండయాత్రలో తొరగంటివారు సాహాయ్యముచేసిరని "రాయవాచకము"లో నున్నది. భట్టుమూర్తిపోషకుడగు అహోబల నరసింహుడు లేక ఓబళ నరసింహుడు 'తొరగంటి దుర్గరాజ్యస్థిర సింహాసన నివాసదీక్షానిధి' అని "నరసభూపాలీయము" లో పేర్కొనబడెను.