పుట:Andhra bhasha charitramu part 1.pdf/711

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

అయిదవ ప్రకరణమునకు

అనుబంధము II.

అనంతపురము జిల్లాలోని గ్రామనామధేయములను గుఱిచిన

మీమాంస.

ఈ విషయము చాలకష్టమైనదే గాక అనేకులను ఆకర్షింపజాలదు. చాలపేర్లు కాలవశమున మారిపోయి వికారరూపమును దాల్చినవి. వాని మొదటిరూపమును నిర్ధరించుటకు చేయు నాలోచన కొంతవినోదము నియ్యవచ్చును. ఇందులో కష్టమేమనగా జనులు చెప్పుకొను అర్థములకును ఉచ్చారణలోనున్న పదజాలమునకు గల శబ్దశాస్త్ర వ్యుత్పత్తికిని వ్యత్యాసము కనబడుచునే యుండును. చరిత్రసంబంధమైన నామధేయములు మారి, జనులవాడుకలోని ఐతిహ్యములను గుఱించిన పేరులు నిలిచియుండును. కొన్ని ప్రాచీనగ్రామముల గుర్తించుటయే కష్టము. కొన్ని గ్రామములే అదృశ్యములైనవి. కొన్నింటిపేర్లు పూర్తిగా మారినవి. కొన్ని తమిళ, కన్నడ, మహమ్మదీయ, ఆంగ్లభాషాసంపర్కముచే వికృతము లైనవి. పై విషయమును వ్రాయదలచుకొనువాడు ఈ మార్పుల నన్నింటిని గమనింపవలెను. కావున కొన్ని గ్రామముల పేళ్లయర్థ మిదమిత్థమని తేల్పలేకపోవుటలో నాశ్చర్యములేదు.

ఈ చర్చ అనేకవిధములుగా ఉపయోగకరమైనది. శబ్దోత్పత్తిశాస్త్రమునకు (Philology) ఇది చాల సాహాయ్యకారి. ప్రజల పరదేశగమనమును లేదా వలసల (Migration) ను గుఱించి పరిశోధించువారి కీచర్చ మిక్కిలి తోడగును. వివిధజాతు లెంతవఱకు దేశములో పలుకుబడి సంపాదించినవో ఇందువలన తెలిసికొనవచ్చును. గ్రామములు, పట్టణములు నెలకొల్పబడిన నివేశసములబట్టి, పూర్వుల అవసరము లేవో, ఎట్టిప్రదేశములు వారిదృష్టిలో వాసయోగ్యములో ఊహింపవచ్చును. ఏ రాజవంశీయులు ఏయే ప్రదేశములను చిరకాలము పాలించిరో, ఎవ్వరు దిగ్విజయయాత్రచే మాత్రమే తృప్తిపడిపోయిరో, లేదా ఓడి వెనుదిరిగిపోయిరో కనుగొనవచ్చును. ఘనులైన వ్యక్తుల యొక్కయు వంశములయొక్కయు చరిత్రలను కొంతవరకు అన్వేషింపవచ్చును. వివిధమతముల చొరవను, జనుల నాగరకతాసరళిని గ్రహింపవచ్చును. భిన్నజాతుల సంపర్కసహవాసముల నెఱుంగవచ్చును.