పుట:Andhra bhasha charitramu part 1.pdf/688

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

అయిదవ ప్రకరణమునకు

అనుబంధము I.

నిఘంటువులకెక్కక, వాఙ్మయమున వాడబడక, నిలిచియున్న తెనుగు శబ్దము లెన్నియో గలవు. వానిలో వేర్వేఱు వృత్తులకు సంబంధించిన శబ్దములనైన నొకచోట జేర్చుట కింతవఱకు బ్రయత్నములు జరుగలేదు.

ఈ క్రింద నాంధ్రదేశమునందలి నావికు లుపయోగించుపదముల పట్టిక మచ్చున కివ్వబడినది. "మాలీమ్‌శాస్త్రము" ( The art of navigation) అనుపుస్తకమును నే నాంధ్రీకరించుటకు గొన్నినెలలు మచిలీపట్టణమున నుండవలసివచ్చినది. అప్పుడు తెనుగు నావికులతో సముద్రముపై నావికులతో నోడలలో సబురులు పోవుచు వారు మాట్లాడు మాటలను గుర్తించి, వారివలన నే నాయా పదముల కర్థములను దెలిసికొని యొకపట్టికను వ్రాసితిని. ఆంధ్రపదజాలవిస్తారము నిర్ణయించుట కిట్టి ప్రయత్నముల నెన్నిటినో యెందఱో చేయవలసియున్నదని తెలుపుటకును, అట్లు సేకరించుటయందుగల కష్టమును నిరూపించుటకును ఈ పట్టిక ననుబంధముగ నిచట బొందుపఱుచు చున్నాను.

మనవా రోడలను నడపుటయం దనాదిగా బ్రసిద్ధి వహించియుండిరి. ప్రాచీనకాలపు టాంధ్రనావికశబ్దము లెవ్వియో తెలిసికొనుట కష్టమే. కాని, మనవారి కితరదేశనావికులతోడి సంబంధము కలుగుచురాగా, నా యితర దేశభాషాపదములనుగూడ నుపయోగింపసాగిరి. ఈ పట్టికలోనివి కొన్ని అరబ్బీపదములు; కొన్ని యింగ్లీషుపదములు, కొన్ని పోర్తుగీసు, డచ్చి, ఫ్రెంచి భాషలకు సంబంధించినవి. వీనిని బట్టి యాయా పదములు తెనుగువారి వ్యవహారమున నె ట్లేయేకాలమున బ్రవేశించినదియు దెలిసికొనవచ్చును.