పుట:Andhra bhasha charitramu part 1.pdf/625

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

గ్రంధములకెక్కిన వగుటచే లాక్షణికులదృష్టి నాకర్షించినవి. వానిమూలమున సాధ్యమయినంతవఱకు సంస్కృతముతోడి దగ్గఱ సంబంధము నిలిచినది. గ్రాంధికములుగాని యితర వ్యావహారికభాషలకన్నిటికిని లాక్షణికులపభ్రంశమును పేరిడిరి. కాని, అపభ్రంశమొక్క భాషకాదు. ప్రధాన ప్రాకృతములలో నొక్కొక్కదానికి ననేకాపభ్రంశరూపము లున్నవి. ఈ యపభ్రంశభాషలలో గొన్ని తరువాతకాలమున గ్రాంధికములయినవి. ఇట్లు గ్రంధస్థములయిన వ్యావహారికభాషల నన్నిటిని లాక్షణికు లపభ్రంశ మనుపేర వ్యవహరించిరి. సంస్కృతమునకు బూర్వమే యీ దేశమున నెలకొనిన పైశాచీభాషలు వ్యవహారమున ననేకములుగ నుండినవి. వీరికిని దత్తత్ప్రాంతములం దుండిన యితర ప్రాకృతములకును గలిగిన సంపర్కమువలన నాధునికయుగమున ననగా క్రీ. శ. 6-వ శతాబ్దము నుండియు గ్రొత్త దేశభాష లుదయింప జొచ్చినవి.

నేటిరూపమును దాల్చి గ్రంధస్థములు కాజొచ్చిన దేశభాషలలో మొదటివి ద్రావిడభాషలు. వీనిలో నాంధ్రము, కన్నడము, తమిళము, ముఖ్యములు. వీనియం దించుమిం చేకకాలముననే (ఒకటిరెండు శతాబ్దములకీవల నావల) వాఙ్మయము వెలువడినది. పశ్చిమతీరము ననుసరించి వ్యాపించిన బాహ్లిక పిశాచజనులభాషకును, వింధ్యపాదము నాశ్రయించి వ్యాపించిన పిశాచార్యజనులభాషలకును గలిగిన సంపర్కమువలన పడుమటికనుమలకు గొంచెముత్తరముగనున్న ప్రదేశమున నూతనభాషా సమ్మేళనము జరిగినది. ఈ సమ్మేళనము జరుగక పూర్వమే పైశాచీ జనులలోని యొకశాఖవారీప్రదేశమునుండి తూర్పునకు దిరిగి తూర్పుసముద్ర తీరమున గాంచీదేశము వెంబడి దక్షిణదేశము నాక్రమించిరి. కొంతకాలమునకు వారు సింహళమును గూడ జొచ్చిరి. వీరే తమిళులు. వీరినుండి తరువాతికాలమున నొకశాఖ మఱల దక్షిణమున బడుమరగ వ్యాపింపగా మళయాళభాష యేర్పడెను. మహారాష్ట్రాంధ్రకర్ణాటకములకు సామాన్యముగ --- భాష యాంధ్ర సామ్రాజ్యకాలమునాటికి, అనగా క్రీ. పూ. 3-వ శతాబ్దమునుండి క్రీ.శ. 3-వ శతాబ్దము వఱకు నుండుచు, మఱల వ్యవహార రూపమున విడిపోజొచ్చెను. ఈవిడిపోవుట కాయాజనులు వ్యాపించిన ప్రదేశములం దంతకుబూర్వముండిన భాషలతోడి సంపర్కమే కారణము. ఇట్లు విడిపోయిన భాషలే నేడు మరాఠీ, ఆంధ్రము, కన్నడము, అనివ్యవహరింపబడుచున్న భాషలు. ఈమూడింటిలో నాంధ్ర కర్నాటకములు తొలుత కలిసి విడిపోగా, మరాఠిభాష తనస్థామునందే నిలిచినది. కొంతకాలమున కాంధ్రకర్నాటకములును విడిపోయి, తత్తత్ప్రాంతభాషలతో గలిసి ప్రత్యేకత్వము నొందినవి.