పుట:Andhra bhasha charitramu part 1.pdf/623

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


చున్నదనుటకు సందియములేదు. ప్రాచీన భరత, పరత, పరద జాతివారు బ్రాహూఈలు, 'పరవర్‌', పారేయులు మొదలగు జాతులుగ నేడును నున్నారని యూహించుట కవకాశమున్నది.

భరతులొకానొక కాలమున నత్యుచ్చనాగరకదశయం దుండిరనుటకు నేడు సింధుదేశమున హారప్పా, మోహింజో-దరో యను ప్రదేశము లందు బయల్పడుచున్న ప్రాచీనపట్టణముల శిథిలమువలన దెలియుచున్నది. అచ్చట బయల్పడుచున్న శిథిలములవలన దెలియవచ్చు నాగరికత యార్యనాగరకత కాదనియు, నేటి బ్రాహుయీలకు బురాతనపూర్వుల నాగరకతయనియు బండితులు తలంచుచున్నారు. ఇచ్చట బయట బడుచున్న కొన్ని నాణెములమీదను, తోళ్లమీదను, చెట్లపట్టలమీదను గొన్నిలేఖనములు గాన్పించుచున్నవి. వానిని జదువ బండితులు ప్రయత్నించుచున్నారు. వానియందలి విషయములు బయలుపడువఱకును నీ విషయమై యిద మిత్థమని చెప్పవీలులేదు.

ప్రాచీనపిశాచజనుల చరిత్రమునుగూర్చిన విశేషములు పైని సంగ్రహముగ వివరింపబడినవి. ఆజనులు భరతవర్షమున నెట్లువ్యాపించినదియు నిరూపింప బడినది. ప్రాకృత లాక్షిణికులు భారతవర్షమున బిశాచభాషలు మాట్లాడబడునవని చెప్పిన యాప్రదేశములందలి యాధునికభాష లింకను గొంతవఱకు బైశాచీ ప్రాకృతలక్షణములు గలిగియుండుట గమనింపదగియున్నది. ఆదేశముల నేటిభాషలకును ద్రావిడభాషలకును నింకగొన్ని పోలికలు నిలిచియున్నవి. వానిని వివరింపకపూర్వ మార్యులకు బూర్వమే ఈదేశమునందు నెలకొనియుండిన పైశాచీ భాషలయం దార్యులు వచ్చిన తరువాత నెట్టిమార్పులు గలిగినదియు గొంత చెప్పవలసియున్నది.

పిశాచజాతులవారగు నైరేనియను లీ దేశమున స్థిరనివాసముల నేర్పఱచుకొని యంతకుబూర్వ మిచటనుండిన జాతులవారితో సఖ్యము నెఱపి వారిని తమలో గలుపుకొనుచుండినకాలమున నార్యులును బ్రవేశింపజొచ్చిరి. ఇదియే వేదమంత్రముల నిర్మాణకాలము. ఇప్పటికే ఐరేనియనుభాషకును నీ యార్యులభాషకును భేద మేర్పడియుండెను. వారి మతాచారవిషయము లందు గొప్పయంతర మేర్పడెను. మతవిషయము లందలి భేదములచే నేడును నెట్టి వైషమ్యములు గలుగుచున్నవో చూచినయెడల నానాడవి యెంతటి శత్రుత్వమునకు గారణములై యుండెనో యూహించు కొనవచ్చును. అందును నొకరిదేవుడు మఱియొకరికి దయ్యము, ఒకరి దయ్యము మఱియొకరికి దేవుడు నయిన సందర్భములం దాశత్రుత్వ మతితీవ్రమనుటకు సందేహముండదు. ఆర్యులకును అసురులు, పణులు, దస్యులు మొదలగు