పుట:Andhra bhasha charitramu part 1.pdf/622

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ముగలదని యాతని యభిప్రాయము. పరదులకును బ్రాహూయీలకును గల యీ సంబంధము నొశ్చయమైనచో నీ పదముచరిత్రము ఋగ్వేదకాలము వఱకును ప్రాకుచున్నది. పరతశబ్దము భరతశబ్ద భవమగును. పైశాచీభాషయందు వర్గాయాక్షరములలోని, మొదటి నాలుగు వర్ణములకును తత్తద్వర్గ ప్రధమాక్షరము నిలుచును. కావున భరత అనుపదము పైశాచీ భాషయందు పరత యగుచున్నది.

భరతులు ఋగ్వేదమున బేర్కొన బడియున్నారు. సుదాసుడు త్రిత్సులకు నాయకుడు. ఇతని కెదురుగ బదిజాతులవారు కలిసి యుద్ధముచేసిరి. వారిలో భరతులు చాలముఖ్యులు. విశ్వామిత్రుడు తొలుత సుదానునకు బురోహితుడుగ నుండెనుగాని, యాతనితో గలహించి భరతులకు ముఖ్య పురోహితుడుగ జేరెను. ఇదిగాక విశ్వామిత్రుని జాతివారగు కుశికులు భరతజాతికి దగ్గఱసంబంధముగలవారై యుండిరి. భరతులు విశ్వామిత్రునితో విపాశ, శుతద్రు, నదులయొద్దకు జేరిరి. ఆ నదులప్పుడు పెద్దవఱదలలోనుండెనుగాని విశ్వామిత్రుని ప్రార్థనలవలన నవి భరతులకు దారియిచ్చెను. అయినను విశ్వామిత్రునికి బ్రతిస్పర్ధియు, సుదాసునికి బురోహితుడుగ జేరినవాడును నగు వసిష్ఠునిమంత్ర సాహాయ్యమున త్రిత్సులకే జయము కలిగెను. ఈ యాఖ్యానము మనకు జాలముఖ్యమైనది. విశ్వామిత్రుడెప్పుడును నార్యులకు బ్రతిస్పర్ధిగనే వేదములందును బురాణములందును గాన్పించుచున్నాడు. విశ్వమున కమిత్రుడను నర్థముగల విశ్వామిత్రనామ మతని కందువలననే కలిగియుండవచ్చును. విశ్వామిత్రవంశమువారని తెలుపబడిన జాతులవారందఱును వ్రాత్యులు, అనగా నార్యధర్మనుండి భ్రష్టులయినవారు అనిపిలువబడుటకు నిదియే కారణమయియుండును.

పురాణకాలము నాటికి భరతజాతివారు తమకంటె బలవంతులగు కురుజాతులలో లీనమైపోయిరి. మహాభారతమున గురుసంతతికి మూలపురుషుడగు భరతుడు స్మరింపబడినాడు. కాని, భారతు లనుజాతి ప్రత్యేకముగ గానరాదు. ఒకప్పుడు ప్రత్యేకముగ నుండి పరస్పరవైరము గల కురులును భరతులును భరతుని సంతతివారనియే మహాభారతము తెలుపుచున్నది. కురువంశీయులు గూడ భారతవంశవర్ధనులుగనే యందు పిలువబడినారు. భరతుని తల్లియగు శకుంతల విశ్వామిత్రునికిని మేనకకును జనించి, కణ్వాశ్రమమున నార్యధర్మమున బరివర్ధితయై, యార్యధర్మానుసారి యగు దుష్యంతుని జేపట్టి నట్టును, శకుంతలాదుష్యంతులకు భరతుడు పుట్టగా నాతనినుండి కురువంశము సాగినట్లును భారతమున గల యైతిహ్యము తొల్లిటి యైరేనియను జాతులవారు తిరిగి భరతవర్షమున నెట్లైక్యమందినదియు జాటు