పుట:Andhra bhasha charitramu part 1.pdf/621

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

గూర్చి విచారింప వలసియున్నది, బ్రాహుయీభాష ద్రావిడభాషలకు సంబంధ్ంచినదని భాషాశాస్త్రజ్ఞులు తలంచుచున్నారు. కాని వీరిజాతిని గూర్చి వివిధాభిప్రాయము లున్నవి. ద్రావిడులు, సిధియనులు, పర్వతీయులగు తార్తరులు, అరబ్బులు, ఐరేనియనులును, ఈ జాతులవా రందఱితోడను బండితులు బ్రాహుయీలకు సంబంధము గల్పించుచున్నారు. కొందఱు బ్రాహూ-యీ పదము 'బ-రోహి' (పర్వతములకు సంబంధించిన) అను పర్షియను పదమునకు వికృతి యనుచున్నారు. ఇతరులు బ్రాహో లేక బ్రాహిన్ అను నామాంతరములు గల 'ఇబ్రహిమ్‌' అను నొక పురుషుని సంతతివారే బ్రాహూ-యీ లని చెప్పుచున్నారు. కొందఱు వీరికిని 'జాద్గల్, జాగ్దల్‌' అను పేరుగల నేటి 'జాటు' లకును సంబంధమును గల్పించుచున్నారు. జాడ్గ లనువారు 'మెంగలులు (Mengals), బిజంగోలు (Bizangos), జెహ్రీలు (Zahris) అను మూడు తెగలుగ నున్నారు. వీరిలో 'మెంగలు' తెగలోనివారగు 'జఘర్ మెంగల్‌' (Zaghar Mengal) అనువారు మధ్య ఆసియాలోని 'సమర్కండ్‌' ప్రాంతమందలి 'జుగ్దు' (Zughd) జిల్లానుండి వచ్చితిమని చెప్పుకొనుచుందురు. మెంగల్ పదములోని 'గళ్‌' ప్రత్యయము లేకుండ 'మెన్‌' అనుపదము 'బెహిస్తున్‌' (Behistun) శాసనములలో 'డెరయస్‌' చక్రవర్తి తనరాజ్యమునుండి తరిమివైచిన యొకజాతివారికి పేరుగా గానవచ్చుచున్నది. 'సజ్‌దీ' (Sajdi), 'సగ' అనువారు బ్రాహూయీలలోని రెండుతెగలవారు. వీరు ప్రాచీన గ్రీకుచరిత్ర కారులు వర్ణించిన 'సగటే' (Sagatae), 'సాకీ' (Saki) జాతుల వారుగ పండితులు తలంచుచున్నారు. బ్రాహుయీలు తమపూర్వులు 'అలెప్పో' ప్రాంతమునుండి వచ్చిరని చెప్పుదురుగాని దీని కాధారములేదు. ఆధునికసిద్ధాంతముప్రకారము వీరు ద్రావిడజాతికి సంబంధించినవారనియు, తమబంధువులకు దూరముగ నైరేనియను భాషలమాట్లాడు జనుల మధ్యమున నిలిచిపోయి చాలవరకు అరబ్బులభాషను, నాచారములను, నవలంబించు చున్నారనియు దెలియుచున్నది. వీరికిని వీరితో గలిసియుండు 'బెలూచీలు' 'ఫరాసు' లకును దేహనిర్మాణమున జాలభేదము కలదు.

ఇట్లు, బ్రాహుయీలను గూర్చిన వివిధాభిప్రాయములతో 'ఆపెర్ట్‌' పండితుడు (Dr. Gustav Oppert) తెలిపిన యభిప్రాయము గమనింపదగియున్నది. బ్రాహుయీ యను పదము పరత, పరద, అను పదములతో సంబంధించినదని యాతని యభిప్రాయము. పరదశబ్దములోని తొలి 'ప' కారము 'బ'కారమై దానిమీది యత్వము లోపించుటచే 'బ్ర'గ మారి 'బ్రాహుయీ' అను పద మేర్పడినదనియు, ఈ పరతులకును పరవరులకును మహారాష్ట్రదేశమందలి పరవారీలకును, పలమాన్ ప్రాంతమందలి పరహేయులకును, సంబంధ