పుట:Andhra bhasha charitramu part 1.pdf/62

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

దేవుని శ్రీశైల తామ్రశాసనము నందాతనికి ద్రావిడాంధ్ర మహీపతి అను బిరుదమున్నది.

పై శాసనముల బట్టియు నితరాధారముల బట్టియు నాంధ్రులు తొలుత మ్లేచ్ఛులుగా బరిగణింప బడియు నానాటికి దేశమందంతటను వింధ్యపర్వత ప్రాంతములనుండి నానాముఖముల వ్యాపించి ప్రబలులై రాజ్యముల స్థాపించుకొన్నట్లును వారు వ్యాపించిన దేశమున కాంధ్రదేశమను సంజ్ఞ కుదురుకొన్నట్లును దెలియనగును. ఈ యాంధ్రదేశమును క్రీస్తు శకారంభమున శాతకర్ణులను వారు జయించి రాజ్యమును సాగించినట్లు గొందఱు చెప్పుదురు. శాతకర్ణు లాంధ్రులేయను వాదముగూడ గలదు. ఈ శాతకర్ణులలో గౌతమీ శాతకర్ణులు, వాసిష్ఠీపుత్ర శాతకర్ణులు, మాడరీపుత్ర శాతకర్ణులు, అను మూడు విధములవా రున్నట్లు రాజుల పేళ్లనుబట్టి తెలియవచ్చుచున్నది. ఈ యాంధ్రరాజ్యము తూర్పుతీరమునుండి పడమటితీరమునకు వ్యాపించినదో పడుమటనుండి తూర్పుతీరమునకు వ్యాపించినదో యను విషయమై వివాదములున్నవి. కృష్ణాజిల్లాలోని శ్రీకాకుళ మాంధ్రరాజులకు మూలస్థానమను వా రాంధ్రులు పశ్చిమమునకు వ్యాపించినట్లు చెప్పుదురు. నాసిక మూలస్థానమను వా రాంధ్రులు తూర్పునకు వ్యాపించినట్లు చెప్పుదురు.

ఇట్లాంధ్రులనియు నాంధ్రదేశమనియు వ్యవహరింప బడుచున్న శబ్దము లాంధ్రరాజుల శాసనములందు కానరాకుండుట చిత్రముగా నున్నది. ఆంధ్రభాషయను పేరుగూడ నాంధ్రరాజుల శాసనములందు గానరాదు. తిక్కనకాలమువఱకును తెనుగున కాంధ్రనామమున్నట్టు నిదర్శనములు లేవు. ఆంధ్రరాజుల శాసనములన్నియు బ్రాకృతమునందున్నవి. ఇవి నాసిక కార్లేయను పశ్చిమతీర ప్రదేశములనుండి గోదావరీ కృష్ణానదీ మార్గముల ననుసరించి యిప్పటి యాంధ్రదేశమునకు గర్భమనదగు గుంటూరు సమీపమున నున్న అమరావతి, ధాన్యకటకము, నాగార్జునకొండ మొదలగు ప్రదేశములందు నిబిడములై తూర్పు సముద్రతీరమున కృష్ణానదీముఖమువఱకు వ్యాపించి యున్నవి. ఈ శాసనముల భాష యాంధ్రభాష యనుకొనినచో నది నేటి తెలుగు రూపమును దాల్చువఱకు నెట్టి పరివర్తనముల బొందినదియు దెలిసికొన వచ్చును. ఈ యాంధ్రదేశపు భాష యెట్టిప్రాకృత మనువిషయముగా వివిధాభిప్రాయములు కలవు. క్రీస్తు శకారంభమున నీ ప్రదేశమంతయు బౌద్ధమతాక్రాంతమై యున్నట్లు చరిత్రమువలన దెలియుచున్నది. సింహళ ద్వీపమునం దేర్పడిన తిపిటకములను బౌద్ధ ధర్మగ్రంధములభాష పాలిభాషయని పిలువబడుచున్నది. ఈ పాలిభాష యెక్కడిదను విషయమును ఓల్డెర్ బర్గు పండితుడు తాను సంపాదించిన తిపిటకములను గ్రంధము రెండవ సంపుట