పుట:Andhra bhasha charitramu part 1.pdf/619

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

లేదు. విస్మరింపనులేదు. ఆర్యజాతులవారు వీరినందఱను పిశాచజనులని నిందార్థమున వ్యవహరించుట తమకుగల శత్రుత్వము వలననే యని మన మెఱుగ గలము.

ఆర్యులకును, ఐరేనియనులకును మతవిషయములను గూర్చియు నాచారములను గూర్చియు వివాదములు సంభవించెను. ఐరేనియనుభాషలో అసుర శబ్దమునకు సర్వశక్తుడగు నీశ్వరుడనియు, దేవశబ్దమునకు దుష్టభూతమనియు నర్థములు గలవు. ఆర్యభాషలం దీయర్థములు తారుమారైనవి. అం దసురు డనగా దుష్టభూతము; దైవమనగా పరమేశ్వరుడు. పిశాచ శబ్దమునకు నిట్లే యార్య, ఐరేనియను భాషలయందు, పరస్పర విరుద్ధములగు నర్థములు గలవు. ఐరేనియనుభాషలో పిశాచమనగా ప్రకాశించువాడు. ప్రకాశించునది, ప్రకాశము ననునర్థములు గలవు. సంస్కృతభాషయందు దీనికి దుష్టభూత మను నర్థము గలదు. పిశాచ శబ్దము ప్రాకృతమునందు 'పిసాళిఓ' అగును. తెనుగున పిసాళి, పిసాళించు, పిసాళము, మొదలగు పదములు ప్రకాశార్థమున నుండుటను గమనింప వచ్చును. ఆంధ్రులు పిశాచ జాతివారనుటకు వారారాధించు అసిరమ్మ అను దేవతావాచక శబ్దమును, వారు దుష్టభూతమను నర్థమున నుపయోగించు దయ్యము అనుపదమును, ప్రకాశార్థమున వాడునట్టి పిశాచ శబ్దభవమగు పిసాళి యనుపదమును చక్కని నిదర్శనములుగ నున్నవి. వేదములం దసురులు పేర్కొనబడి యున్నారు. సురశబ్ద మసురశబ్దమునుండి తరువాతికాలమున నేర్పడినది. కావుననే యమరులకును రాక్షసులకును పూర్వదేవత లను పేరు గలిగినది. అసురులు తాము పుణ్యజనులనుపేర వ్యవహరించుకొనుటచే పుణ్యజనులను నామ మార్యభాషలం దసురులకు పర్యాయపదముగ వాడబడుచు వచ్చినది.

ఆర్యులకును "అహుర" నామమున నైరేనియను భాషలలో నున్న పరమదైవమగు నసుర నారాధించువారికిని జాలకాలమువఱకు నిరంతరముగ బోరాటము గలిగెను. అందు గొందఱసురు లార్యులతో సంధిచేసికొని వారికి సామంతులుగ నార్యకుటుంబములో నెలకొనిరి. వరుణు డట్టివాడు. అతడసురుడైనను నార్యదేవతలలో జేరినాడు. ఇతడు తొలుత నింద్రునికి బలవద్విరోధియై, తత్పదము నాక్రమించుటకు కొంతకాలము ప్రయత్నించినట్లు ఋగ్వేదవాక్యమువలన దెలిసికొనవచ్చును. కాని కొలదికాలమున కాతడంతరిక్షమున నాధిపత్యము నంగీకరించి యార్యఋతమును, అనగా ధర్మమును బరిపాలింప నంగీకరించెను. ఆతడు పంజాబు దేశమందలి యార్యుల రాజ్యములకును, హిమాలయ పర్వతములకావలనుండు నై రేనియనుజాతుల వారికిని నడుమనుండు దేశము నాక్రమించి యార్యులకు దమశత్రువుల