పుట:Andhra bhasha charitramu part 1.pdf/618

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


దాక్షిణాత్య, పాండ్య, సింహళశాఖలవారు ఈశాఖలవారు మఱల బశ్చిమమునకు వ్యాపించి తొల్లిటి బాహ్లికశాఖవారితో గలిసికొనిరి. కొందఱు సింహళమునకు దారితీసిరి. ఈరీతిగా వింధ్యపర్వతములకు దక్షిణప్రదేశ మంతయు బిశాచాక్రాంతమయ్యెను. వింధ్యపర్వతముల కుత్తరమున వారు హిమవత్పర్వతపాదభూములందును, మగధదేశమునందును సింధునదీమార్గమున బశ్చిమప్రదేశములందును మాత్రము నిబిడముగ నెలకొనిరి.

ఇదియంతయును నార్యులకును నైరేనియనులకును మతవిషయములందు భేదాభిప్రాయములు గలిగి, కలహములు జనించుటకు ముందుగనే జరిగినది. ఆర్య - ఐరేనియనుల చీలికకు పూర్వమే, అనగా ఐరేనియనుభాష ప్రత్యేకవ్యక్తిత్వమును బొందక పూర్వమే యీపిశాచజను లిండియాయందు ప్రవేశించి రని గ్రియర్సను పండితు డభిప్రాయపడుచున్నాడు. కావున పైశాచీభాషలు వైదికభాషకనంతరమును, ఐరేనియనుభాషకు పూర్వమునను గల ఆర్య - ఐరేనియనుభాషావస్థను దెలుపుచున్నవని యాతనితలంపు. కాని, యీ పిశాచజను లందఱు నేక కాలమున భారతవర్షములోనికి రాలేదు. వారు వివిధకాలములందు వేర్వేఱుగుంపులుగా నీదేశములోనికి వచ్చియుండిరి. ఆర్యులకును బిశాచజనులకును దమమాతృదేశమందే కలహము లేర్పడెను. కావున దరువాతికాలమున నార్యులు భరతవర్షమును బ్రవేశించినప్పుడు వారికి తమతొల్లింటి శత్రువులతోడనే యుద్ధములు కలుగ జొచ్చెను. కాశ్మీరము లోనికిని దత్ప్రాంతదేశముల లోనికిని నీ పిశాచజనులు ప్రవేశించుట యిండియాలోనికి బ్రవేశించుటకు దరువాత జరిగియుండవలెను.

ఆర్యులకును ఐరేనియనులకునుగల యీ శత్రుత్వము ననుసరించియే మనువు పుండ్రక, ఓడ్ర, ద్రావిడ, కాంభోజ, యవన, శక, సరద, పల్లవ, చీన, కిరాత, దరద, ఖాస, జాతులవారిని వృషలులుగ బరిగణించియున్నాడు; వృషలశబ్దమునకు 'వ్రాత్య' అనునది పర్యాయపదముగ నున్నది. వృషలులును వ్రాత్యులును ననార్యులుగ మనువు వ్యవహరించియుండలేదు. ఆర్యమతమునుండి పరిభ్రష్టులయినవారే వృషలులని యాతని యభిప్రాయము. మనువు వివరించిన పై జాతులవారిలో యవన, శక, సరద, పల్లవ, చీన దరదులు నేటి వాయవ్యపుపరగణాల కావలనున్న ప్రదేశములందలి వారనియు, వారిసంతతులవారు నేటికిని నాప్రాంతము లందున్నారనియు మనకు దెలియును. ఐతరేయబ్రాహ్మణమున నాంధ్ర, పుండ్ర, శబర, పుళిందులు వ్రాత్యులుగను, విశ్వామిత్రసంతతివారుగను వర్ణింపబడుట యార్య, ఐరేనియనుల వైరము ననుసరించియే యైయున్నది. ఎట్లయినను నీ జాతులవారందఱికిని నార్యులకును గల సంబంధము నెవ్వరును నిరాకరింప