పుట:Andhra bhasha charitramu part 1.pdf/61

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

మిత్రుని సంతానమైనట్లును, వారు పుండ్ర, శబర, పుళింద, మూతిబాది జాతులతో దన్యులుగా బరిగణింప బడినట్లును దెలియుచున్నది మనుస్మృతిలో - "కారవరం నిషాదాత్తు చర్మకారాం ప్రసూయతే | వైదేహకా దంధ్రమేదౌ బహిర్గ్రామవ్యవస్థితౌ" అని యున్నది. దీనిప్రకారము ఆంధ్రులు వైదేహకులకు జనించినవారనియు, వారు గ్రామములకు బయట నుండవలసిన వారనియు దెలియుచున్నది. పురాణములలో నాంధ్రుల ప్రశంస గానబడుచున్నది అం దంధ్ర, ఆంధ్ర శబ్దములు రెండును కానవచ్చుచున్నవి. వాయు మత్స్యపురాణములలో నంధ్రులనుపేరును, వాయుపురాణమున నంధ్రియలను పేరును గానవచ్చుచున్నది. భాగవత పురాణమున చాణూరమల్లు డాంధ్రుడని యున్నది మెగాస్తనీసు అను గ్రీకు రాయబారి యాంధ్రులను బేర్కొనియున్నాడు. అశోకుని శాసనములందు ఆంధ్రశబ్ద మున్నది. అశోకుని గిర్నారు శాసనములందు 'అంధ పిరిందేషు' అనియు, షాబాజుగడీ శాసనములందు 'భోజపితిని కేషు ఆంధ్ర పులిదేషు' అనియు నున్నది క్రీ పూ. 150 సంవత్సరపు హాధీ గుంఫా శాసనమున నాంధ్రవంశములోని మూడవరాజగు శాతకర్ణి పేర్కొనబడి యున్నాడు. ఇతడు కళింగరాజగు ఖారవేలునకు సమకాలికుడు. కృష్ణాజిల్లాలోని చిన్నచిన్న యను గ్రామమునకు సమీపమున కృష్ణానదికి దక్షిణమున సముద్రతీరమున నాంధ్రరాజగు యజ్ఞశ్రీ గౌతమీపుత్ర శాతకర్ణి 27 వ రాజ్య సంవత్సరపు శాసనమొకటి దొరకినది. పులమావియను నాంధ్రరాజు నేడవరాజ్యసంవత్సరపు శాసనమొకటి కార్లేయొద్దను, మఱియొకటి భీల్సావనము నొద్దను దొరకినవి. గుంటూరుజిల్లాలోని యమరావతియొద్ద గౌతమీపుత్ర శాతకర్ణి తరువాత రాజ్యమునేలిన వాసిష్ఠీపుత్ర శ్రీపులుమావి శాసనము చిక్కినది క్రీ శ. 554 లోని హరహ శాసనమునం దాత డాంధ్రపతిని జయించినట్లున్నది. విగ్రహపాలుని పండ్రెండవరాజ్యసంవత్సరపు శాసనమున - "మహత్తమోత్తమకుటుంబి పురోధార్ మేదాంధ్ర చండాల పర్యంతం" అని యున్నది. దీని ప్రకార మాంధ్రులు మేదులతోడను చండాలురతోడను చేర్పబడినట్లు దెలియుచున్నది. క్రీ.శ. 1115 సంవత్సరపు జాజల్లదేవుని రత్నపుర శిలాశాసనమున నాంధ్రకిమిడి, కోసలాంధ్ర కిమిడి యను నామములు గానవచ్చుచున్నవి. క్రీ.శ. 1171 సంవత్సరపు మదగిహల్లు శాసనమును బిజ్జలుడు ఘూర్జర మగధ కళింగాంధ్ర సౌరాష్ట్ర వేంగీ రాజులను జయించినట్లున్నది. క్రీ.శ. 1358 సంవత్సరపు ఒక శాసనమున ముమ్మిడి నాయకునిగూర్చి "ఆంధ్రశ్రీశో దేశానంధ్రాన్ రక్షితుం" అని యున్నది. క్రీ.శ 1368 సంవత్సరపు సింగనాయకుని అక్కలపూడి శాసనమున నాంధ్రదేశప్రశంస యున్నది. క్రీ.శ. 1466 సంవత్సరపు విరూపాక్ష