పుట:Andhra bhasha charitramu part 1.pdf/59

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

పరగణాలలోని చాందాజిల్లాలో నాంధ్రభాషకు, కోంటావు, సాలేవారి, గోలరి అను పేళ్లున్నవి. ఈమూడును వేర్వేరగు నుపభాషలుగా నెంచుటకు వీలున్నను వానియుచ్చారణమును, సుప్తిజంతవిధానమును నొక్కతీరుగనే యున్నవి. కర్ణాటక దేశములోను బొంబాయి యందును, నాంధ్రమునకు సంబంధించిన కొన్ని యుపభాషలు కలవు. అవి కొన్నివృత్తులకు సంబంధించినవారి యాంధ్రభాషా వికారములుగా నున్నవి. బెల్గాము జిల్లాలో బేరాది, దాసరి, యనుభాషలును, బొంబాయి పట్టణమునందలి కామారీభాషయును, బొంబాయిరాజధాని, బేరారు మొదలగు ప్రదేశములలో సంచారశీలురగు నొకజాతివారు మాటలాడు వడరీ భాషయను నట్టివి ఇవియెవ్వియుగూడ సాధారణవ్యవహారభాష కెక్కువ విలక్షణముగ నుండక పోవుటచే వీనినిగూడ బ్రత్యేకోపభాషలుగా బరిగణింప నక్కఱలేదు.

గ్రాంథిక భాష, వ్యావహారిక భాష.

భాష కేవలము వాగ్రూపముగా నున్నంతకాలమును మార్పులను పొందుచుండుట సహజము. కాని, దానిని వ్రాతరూపమున బెట్టిననాట నుండియు గొంత స్థిరత్వ మేర్పడుచుండును. వ్రాతను చదువనేర్చినవారు పూర్వకాలపు శబ్దస్వరూపమును నిలబెట్టుటకు బ్రయత్నించుచుందురు. ఈ ప్రయత్నము సంపూర్ణముగా సాధ్యము కాకపోవచ్చును. లిఖిత భాషా స్వరూపము గూడ వ్యవహారభాష ననుసరించి మారుచుండుట యసంభవము కాదు. కాని వ్యవహారభాషయంత శీఘ్రముగ లిఖితభాష మాఱ జాలదు. కొన్నినాళ్ల కాభాషయం దుత్తమగ్రంధములు వెలువడినచో నాగ్రంధముల యందలిభాష తరువాతివారికి మార్గదర్శకముగా నేర్పడును. దానికొక ప్రమాణత్వము గలుగును. సాధ్యమగు నంతవఱకు దరువాతివా రాభాషనే యనుకరింప బ్రయత్నింతురు. అయినను, వ్యవహారభాషనుబట్టి యాగ్రంధకర్తల గ్రంధములందలి భాషాస్వరూపమును మాఱుచుండును. భావములనుబట్టియు రుచులనుబట్టియు నాయాగ్రంధకర్తల నుడికారము మారుచుండుట వింతగాదు. అందుచేత నిదియే ప్రమాణ గ్రాంధికభాషయని నిరూపింప వీలులేదు. తొలుదొల్త వ్యావహారికభాషయే గ్రంధస్థమై యుండినను నానాటికిని దానికిని గ్రాంధికభాషకును నంతర మెక్కువయగుట సంభవించి, యారెండును వేర్వేరుగ నేర్పడుచుండును. గ్రాంధికభాష మిక్కిలి మెల్లగ మాఱుచువచ్చుచుండ, వ్యావహారికభాష ముందంజవేయుచు దన సహజమార్గమున మార్పులు