పుట:Andhra bhasha charitramu part 1.pdf/57

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

విస్తీర్ణము.

ఆంధ్రభాష ప్రచారములో నున్న ప్రదేశమునకు తూర్పుదిక్కున నంతయు బంగాళాఖాతమున్నది. దాని కుత్తరపు స్వాభావికమయిన యెల్ల ఋషికుల్యానది. ఆనది కుత్తరమునగూడ నాంధ్రులు వాసమేర్పఱచు కొని యున్నారు. ఋషికుల్యనుండి పడమటగా నాయెల్లపోయి తూర్పుకనుమలను దాటి నైఋతిమూలగా బస్తరు సంస్థానములోని సుంకము, బిజ్జితాలూకాల సరిహద్దయిన శబరీనదిని దాటి, బేలదిలగుట్టలవెంబడి జరగి యింగ్రానదివఱకుబోవుచున్నది. అక్కడనుండి యానది యొడ్డునసాగి, యది గోదావరిని గలియువఱకుబోయి, చాందాజిల్లా దక్షిణభాగ మంతటిని దనలో నిముడ్చుకొని, యింకను దూర్పుగ సాగి పూనుజిల్లా దక్షిణభాగమునంతటిని దనలో జేర్చుకొనుచున్నది. అచ్చటనుండి దక్షిణముగ మంజీరానది గోదావరియందు సంగమించు స్థానమువఱకునుబోయి యింకను దక్షిణముగసాగి బీదరు మండలమున కన్నడముప్రచారములోనున్న ప్రదేశములోనికి చొచ్చుకొనిపోవుచున్నది. అచ్చటనుండి సరిగ దక్షిణముగ నైజామురాష్ట్రములోని యాఱు జిల్లాలను దనలో జేర్చుకొని, తిరిగి బ్రిటిషు ఇండియాలోని బళ్లారి జిల్లాను సరిగ రెండుభాగములు చేయుచున్నది. ఆ తరువాత నది యట్లేసాగి యనంతపురము జిల్లా ద్వారా మైసూరుసంస్థానమును చొచ్చుకొని యందలి బెంగళూరు, కోలారు, నందిదుర్గము, చిత్రదుర్గము జిల్లాలను దనలో జేర్చుకొనుచున్నది. అక్కడనుండి యుత్తరఆర్కాడు, చెంగల్పట్టు జిల్లాల మధ్యభాగముగ సాగి తిరిగి బంఘాళాఖాతమును జేరుచున్నది.

ఆంధ్రమున కుత్తరమున ఒఱియాభాష, హళబీ ఉపభాష, గోండి, మరారీభాషలును, పశ్చిమమున మరారీ కన్నడములును, దక్షిణమున తమిళమును బ్రచారములోనున్నవి. ఆంధ్రమున కితరభాషలతో సంయోగము కలుగుకొన్నిచోట్ల నది చల్లచల్లగ వ్యాప్తమగుచున్నది. గంజామున కుత్తరమున నొరిస్సాలోను, మధ్యపరగణాలలోను, నైజామురాష్ట్రములోను, నది నానాటికిని విస్తరించుచున్నది. మైసూరు సీమలో కన్నడ మాంధ్రమును వెనుకకు తఱము చున్నది.