పుట:Andhra bhasha charitramu part 1.pdf/35

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


లందలి దోషము (4) అలసత:- భాషయందలి మార్పులకు పదికి తొమ్మిదివంతున నిదియే కారణమని యాతని యభిప్రాయము (5) స్వరసామ్యమునుబట్టి క్రొత్త పదముల నేర్పఱుచుట (6) స్పష్టోచ్చారణమునకై ప్రయత్నము (7) నూతన భావప్రకట నావశ్యకత, అనునవి కారణములుగ నిరూపించి యున్నాడు. ఈ కారణములలో గొన్నిటిని దరువాతివా రంగీకరింపలేదు.

ఈ కాలమున భాషాశాస్త్రమున గలిగిన క్రొత్త పద్ధతి యా శాస్త్రము భాష యేరీతిగా నుండవలెను, ఎట్టి భావ యుత్తమభాష యను విషయములను నిర్ణయించుట గాక, వృక్షశాస్త్రము మొదలగు శాస్త్రములందువలె భాషయందు కానవచ్చు వివిధ విషయములను క్రోడీకరించి, వర్గీకరించి, వాని స్వరూపము నున్నదున్నట్లు చెప్పుట. ఈ పద్ధతి ననుసరించి పందొమ్మిదవు శతాబ్దము మధ్యమున ననేక భాషల స్వరూపము నిర్ణయింప బ్రయత్నములు జరిగెను. ఆయా భాషల యథార్థస్వరూపములనుబట్టి మ్యాక్స్ మ్యూలరు (Max Muller) మొదలగువారు ప్రపంచభాషల నన్నిటిని వాని వాని లక్షణముల ననుసరించి వివిధభాషాకుటుంబములుగ నేర్పఱిచిరి. ఇట్లేర్పడిన యనేక కుటుంబములందలి ప్రత్యేక భాషల లక్షణములను, నొక భాషయందలి ధ్వనులు మఱియొక భాషయందు పరిణమించిన తీరును, ననుసరించి యా కుటుంబములోని భాషలన్నిటికిని నొకమాతృక యుండవలెనని యూహించి, యా మాతృభాష స్వరూపమును నిర్మింప విద్వాంసులు పూనిరి. అందు ప్రాచీన ఇండో - జెర్మానికు మాతృభాషా నిర్మాణమును గూర్చి యెక్కువ కృషి జరిగెను. ఇందుకొఱకు 'స్వరశాస్త్రము' (Phonetics) నెక్కువగ నభివృద్ధి చేసికొనసాగిరి. కాని, యీ మూలభాషానిర్మాణ విషయమున ననేక కారణములచే శాస్త్రజ్ఞులు కృతార్థులు కాలేదు. వా రీవిషయమున నవలంబించిన పద్ధతి తీవ్రమగు విమర్శకు గుఱియైనది.

పందొమ్మిదవు శతాబ్దము నంతమువఱకును బాశ్చాత్యపండితులు భాషాశాస్త్రమున జేసిన కృషినిగూర్చి యింతవఱకును సంగ్రహముగా దెలుపబడినది. ఆ తరువాత నీ శాస్త్రమును గూర్చి నిరంతరకృషి జరుగుచునే యున్నది. నేడు భాషాశాస్త్రమున మఱియొక యుగ మారంభమయినదని చెప్పవచ్చును. ఈ క్రొత్తయుగమును గూర్చి విట్నీ (Whitney) "పూర్వకాలమున నశాస్త్రీయముగ పదముల వ్యుత్పత్తులను నిర్వచించుటకును నేటి పద్ధతికిని జాల భేధము గలదు. పూర్వు లేర్పఱిచిన వ్యుత్పత్తుల నిప్పటివారు కొన్నియెడల శాస్త్రసాధ్యము లని యొప్పుకొన్నను దగినంత ప్రమాణములేక, వానిని పరిగ్రహింపరు. ఎంత చిన్నవిషయమైనను దానికి సంబంధించిన యితర విషయములనన్నిటిని నేటివారొకచో, జేర్చుకొందురు. అనేక విషయముల