పుట:Andhra bhasha charitramu part 1.pdf/34

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

భాషయైనను సంపూర్ణ చైతన్యముగల వ్యక్తియే. దానిని మాట్లాడువారి మన:పరిణతి నది తెలియ జేయును. భాషను మాట్లాడువారి మన:పరిణామము ననుసరించి యా భాషయందును బరిణామము గలుగుచునే యుండును. ఈ పరిణామమునందు నూతనసృష్టి గలుగుచుండు నవస్థయు, నా సృష్టి మందగించి నిలుకడ కలిగిన యవస్థయు నను రెండవస్థ లుండును. మొదటి యవస్థయందు భాషాప్రయోజనమునుగూర్చికంటె భాషను గూర్చియే శ్రద్ధ యెక్కువగ నుండును. అందుచేత గ్రొత్త వ్యాకరణరూపము లేర్పడుచుండును. రెండవ యవస్థయం దా సంపూర్ణవ్యాకరణరూపములు శిధిలములయి యంతకంతకు నంతరించుచుండును. మనస్సు విషయ ప్రకటనమును గూర్చి యెక్కువగ నాలోచించునప్పుడు భాషనుగూర్చి యంత శ్రద్ధ వహింపదు. కావున, నీ యవస్థయందు భాష యెక్కువ మార్పులకు లోనగును. అభిప్రాయ ప్రకటనమే ముఖ్యమని తలంచి, వ్యాకరణరూపములందలి సూక్ష్మభేదముల నీ యవస్థయందు లక్ష్యపెట్టరు.

పందొమ్మిదవు శతాబ్దారంభమున నైరోపాయందలి భాషా శాస్త్రజ్ఞుల వ్రాతలయందు కొన్ని ముఖ్య విషయములను గమనింప వచ్చును. (1) సంస్కృతభాషకు బ్రాధాన్యము వచ్చెను. ఏ భాషయందలి రూపము చరిత్రమును దెలుపవలసినను మొదట సంస్కృతరూపము నెత్తుకొనవలెను. 'సంస్కృత భాషా పరిచయములేని భాషాశాస్త్రజ్ఞుడు గణితశాస్త్రము తెలియని జ్యోతిష్కుని వంటివా' డని మాక్సుమ్యూల రనెను. (2) ఈ కాలమున శాస్త్రజ్ఞు లా యా భాషలయందలి పోలికలను మాత్రము గుర్తించుచుండిరిగాని, భేదములను గూర్చి శ్రద్ధ వహింపలేదు. (3) ఆ కాలపు శాస్త్రజ్ఞులు సాధారణముగ వ్యవహారభ్రష్టములగు భాషలను గూర్చియే యెక్కువ కృషిచేయుచుండిరి. వ్యవహారమునందున్న భాషలనుగూర్చి యాలోచించు నపుడైనను, వారు వానియందలి పురాతన రూపములను గుర్తించుటయందే యెక్కువ శ్రద్ధవహించుచుండిరి.

పందొమ్మిదవు శతాబ్దమధ్యమున శాస్త్రజ్ఞుల దృక్పధమున గొంత మార్పు కలిగెను. ఒక మూలభాష వివిధమార్గముల బరిణామమునొంది వివిధభాషలుగ నేర్పడియుండెనని వారు గ్రహించినను, భాష లేలమాఱును? సజాతీయములయిన యొకభాషకును మఱియొక భాషకును నంతటి భేదము గలుగుటకు గారణమేమి? యను ముఖ్య విషయములనుగూర్చి వా రాలోచింపలేదు. బ్రెడ్స్ డార్ఫ్ (J.H. Bredsdorff) అనునతడు పదముల యందలి మార్పులకు (1) తప్పుగా వినుట, తప్పుగా నర్థముచేసికొనుట (2) ఒకమాట యథాస్వరూపమున స్మృతికి రాకుండుట (3) వాగింద్రియము