పుట:Andhra bhasha charitramu part 1.pdf/30

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

చ్ఛికము గాదు. భాషాశాస్త్రజ్ఞు డీ మూడుభాషలను సరిపోల్చునపు డవియన్నియు నేకమాతృకనుండి యుత్పన్నములైనవని తలంపకపోడు. ఆమాతృక నేడు లేకపోవచ్చును. ఇట్లే గాథికు, కెల్టికుభాషలును సంస్కృతముతో సాజాత్యము గలిగినవని యూహింపవచ్చును. ప్రాచీన పెర్షియను భాషయు నీ కుటుంబమునకు జేరినదనియే చెప్పవచ్చును" అని తెలిపెను; కాని, యాతడు తన వాదమును సమర్థించుట కాయాభాషలయందు తగిన కృషిని జేయలేదు.

సంస్కృతభాషా పరిచయమువలన భాషాశాస్త్రమునకు గ్రొత్త మార్గము ననుసంధింప గృషిచేసినవారిలో 'స్ల్కెగెల్‌' (Schlegel) అను నాతడు ప్రథముడు. కాని, యీతడు తత్తద్భాషలయందలి పదము లేధ్వని పరిణామ సూత్రములచే వేర్వేఱు రూపముల దాల్చినవో యను విషయమును గూర్చి కృషిచేయక, పైకి స్పష్టముగ గానవచ్చు కొన్ని పోలికలను మాత్రము గుర్తించితృ ప్తినొందెను. అతడు చేసిన సిద్ధాంతములలో ముఖ్యమయినది ప్రపంచమందలి భాషలను (1) సంస్కృతముతో సంబంధించిన భాషలు (2) తక్కినవి, అను రెండు వర్గములుగా నేర్పఱుచుట.

స్ల్కెగెలు తరువాత నాతని మార్గమున గృషిచేసిన వారిలో బాప్ (Bopp), గ్రిమ్ (Grimm), రాస్క్ (Rask) అనువారు మువ్వురును ననేక భాషలతో బరిచయము గలుగజేసికొని, వానిలో గొన్నిటికి బ్రత్యేకముగ వ్యాకరణములను వ్రాసి యాయాభాషలకు గల సూక్ష్మ సంబంధములను గుర్తించి భాషాశాస్త్రమున ధ్వనిపరిణామ సూత్రముల నేర్పఱుప బ్రయత్నించిరి.

రాస్కు నభిప్రాయమున లిఖితాధారములులేని యా యా జాతుల చరిత్రమును భాషమూలముననే తెలిసికొన సాధ్యమగును. మతము, ఆచారములు, రాజశాసనములు, సంస్థలు, అన్నియును మాఱిపోవచ్చును; కాని, సాధారణముగ భాషమాత్రము స్థిరముగ నిలుచును. దాని స్వరూపము కొంతవఱకు మాఱవచ్చును; అయినను, కొన్నివేల సంవత్సరములు గతించినను నా స్వరూపము గుర్తిపరానంత యెక్కువగ మాఱదు. ఒక భాష కితరభాషలతోడి సంబంధమును దెలిసికొనుటకు దాని నిర్మాణమును గూర్చి యాలోచింపవలయును గాని, ప్రత్యేక పదములనుగూర్చి యాలోచింపగూడదు. పదముల నొక భాషనుండి మఱియొక భాష యెరవు తెచ్చుకొనవచ్చును; కాని, వ్యాకరణరూపముల నెరవు తెచ్చికొనదు. మిక్కిలియు జిక్కయిన వ్యాకరణ నిర్మాణముగల భాష మాతృకకు దగ్గఱగ నుండును. భాష యెంత సంకీర్ణమైన దైనను నందలి యత్యావశ్యకములగు పదము లితరభాషల పదములతో