పుట:Andhra bhasha charitramu part 1.pdf/276

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


నుస్వారము పూర్ణానుస్వారమగుట; (2) శాసనములం దాయాపదము లర్ధానుస్వారచిహ్నముతో గాన్పించుట; (3) లాక్షణికులును వైఘంటకులును నాయాపదము లర్ధానుస్వారయుక్తములని చెప్పుట; (4) నేటివాడుక యందాయా పదములం దర్ధానుస్వారోచ్చారణము వినబడుట; (5) ఇతర ద్రావిడ భాషల యందును, ప్రాచీనార్వాచీనార్యభాషలయందును, తెనుగు పదములతో సంబంధముగల పదములం దనునాసికముగాని యనుస్వారముగాని యుండుట.

వీనిలో మొదటి రెండుమార్గములును దెనుగుపదములందలి యర్ధానుస్వారనిర్ణయమునకు జాలవఱకు దోడ్పడును. అర్ధానుస్వారజ్ఞానమును నన్నయ, ఎఱ్ఱన, తిక్కన, నన్నెచోడుల గ్రంథమువలన నెక్కువనిశ్చయముగ సంపాదింపవచ్చునని తోచుచున్నది. ఆ తరువాతికవుల గ్రంథములందు ప్రాసస్థానమున సాంకర్యము కలిగినది. అర్ధానుస్వార మేశబ్దముననుండవలెనను విషయమునజాల తబ్బిబ్బులు గలిగినవి. ప్రాసముకొఱకును గణముల కొఱకును గొందఱుకవులు కక్కూర్తులు పడసాగిరి. కావున నర్ధానుస్వారనిర్ణయము పట్ల బైనుదాహరించిన కవులగ్రంథములే ప్రమాణమగుచున్నవి. ఇతర కవుల గ్రంథములందలిపదములు పైవారిమార్గము ననుసరించుచో నాప్రయోగములకు మఱింత బలము గలుగును; పూర్వకవుల ప్రయోగములచే స్థిరములుగాని యర్వాచీనులప్రయోగములు సందేహాస్పదములక్రింద జేర్పవలయును; అందు బూర్వకవిప్రయోగవిరుద్ధములయినచో నర్వాచీనులకు బ్రమాణము లేదనియే చెప్పవచ్చును. శాసనములం దర్ధానుస్వారమున్నయెడల నా కాలమున కాశబ్దమునం దర్ధానుస్వారమున్నదనియే నిర్ణయింపవచ్చును. ఇక లాక్షణికులయు నిఘంటుకారులయు నుదాహరణములు పూర్వకవిప్రయోగములనుబట్టి విమర్శించుకొనవలసియున్నది. నేటివాడుకయం దర్ధానుస్వారము గొన్నిప్రాంతములయం దున్నను నది పూర్వకాలముననుండియు నుండినో, యిటీవల గలిగెనో కనుగొనవలెను. ఇతర భాషలయందు మూలపదములలో ననునాసికానుస్వారముల వయుచ్చారణమున్నను దెనుగునగూడ నదియుండవలెనను నియమములేదు. ఇతరభాషలయందలి యనుస్వారోచ్చారణమును దెనుగువా రాదినుండియు విడిచియుండవచ్చును; అనుస్వారములేని పదములగొన్నిటిని గ్రొత్తగ సానుస్వారముగ నుచ్చరించుకొనవచ్చును. అయినను నర్ధానుస్వారనిర్ణయమున దుదిమూడు మార్గములను గొలదిగనైన నుపకరింపక పోవు.

ఈక్రింది పట్టికలో శబ్దరత్నాకరకారు డిచ్చిన యర్ధానుస్వారముగల పదములు చేర్పబడినవి. వానికి శాసనములనుండియు, నతడుదాహరింపని యితరగ్రంథములనుండియు పదములు చేర్పబడినవి.