పుట:Andhra bhasha charitramu part 1.pdf/27

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

సులభమయిన ఆ భాష యంతశక్తి కలిగియుండును; భాషాశక్తి జాతిశక్తిని, ఆ జాతిలో స్వతంత్ర గ్రంథములను వ్రాయగలిగినవారిని ననుసరించి యుండును. స్పష్టత శబ్దజాలము వ్యాకరణములమీద నాధారపడి యుండును. ముఖ్యముగా నది కారకము ననుసరించి యుండును. శ్రావ్యత స్వరవ్యంజనముల వలననే కాక, వాని సంయోజనమువలన గూడ దెలియును. శ్రావ్యతా విషయమున సూక్ష్మవిషయములను కాక, మొత్తముమీద భాష చెవి కెట్లు గోచరించునో యాలోచింపవలెను.

ఈ లక్షణములనుబట్టి జెనిషు తన జర్మనుభాషను ఫ్రెంచిభాషతో సరిపోల్చి తనభాషకంటె ఫ్రెంచిభాషయే యుత్తమమయినదని నిష్పాక్షికముగ తెలిపినాడు. హెర్డరునకును, జెనిషునకును మాతృభాషయొక్కటే యయినను ఒక డభిమానప్రేరితుడై తనభాషను పొగడుకొన్నాడు. ఇంకొకడు తాన్పేరఱిచిన లక్షణములనుబట్టి తనభాషను నిరసించుకొని, శాస్త్రదృష్టిని ప్రకటించినాడు.

పందొమ్మిదో శతాబ్దారంభమున భాషాశాస్త్రనిర్మాణ విషయమున గ్రొత్త దృక్పధ మేర్పడినది. పూర్వపరిశోధకులు కొన్నిభాషలనుగూర్చి మాత్రమే యాలోచించు చుండెడివారు. ఇపుడు ప్రపంచమందలి యనేకభాషల పరస్పర సంబంధమునుగూర్చియేకాక, యాయా ప్రత్యేకభాషల నిర్మాణమును గూర్చియు, నాయాభాషల యందలి వ్యాకరణ రూపముల చరిత్రమును గూర్చియు సూక్ష్మపరిశోధనము లారంభమయినవి. ఐరోపాఖండమున భాషలవిషయమున నీచారిత్రక దృష్టికి గారణ మచటి శాస్త్రజ్ఞులకు గ్రొత్తగా సంస్కృతభాషాపరిచయము కలుగుటయే. ఇంగ్లీషువారును ఫ్రెంచివారును నిండియాలో బ్రభుత్వముకొఱకు బెనగులాడుచుండిన కాలమున నింగ్లీషు విద్వాంసులును ఫ్రెంచివిద్వాంసులును నీ దేశపు నాగరకతనుగూర్చియు, భాషనుగూర్చియు వాఙ్మయమునుగూర్చియు దెలిసికొన బ్రయత్నించిరి. ఫ్రెంచి మిషనరీ యగు కోర్డో (Coeurdoux) సంస్కృతపదములకును లాటినుపదములకును గల సంబంధమును దెలుపుచు నొక వ్యాసమువ్రాసెను ఇంగ్లీషువిద్వాంసుడగు సర్ విలియమ్ జోన్సు భాషాశాస్త్రమున సంస్కృతము ప్రాధాన్యమునుగూర్చి వ్రాయుచు "సంస్కృతభాషా ప్రాచీనత విషయమై భేదాభిప్రాయము లుండవచ్చును; కాని, దాని నిర్మాణ మద్భుతమైనది. అది గ్రీకు భాషకంటె సంపూర్ణమైనది; లాటినుకంటె శబ్దసంపదయందు విశాలమయినది; గ్రీకు లాటిను భాషల రెంటికంటె నెక్కువ సంస్కారము నొందినది. దానికిని నీ రెండుభాషలకును క్రియాధాతువుల విషయమునను, వ్యాకరణ రూపముల విషయమునను దగ్గఱ సంబంధము గలదు. ఈ సంబంధము యాదృ