పుట:Andhra bhasha charitramu part 1.pdf/269

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

శబ్దచింతామణికారుని యభిప్రాయమున ద్రుతసంజ్ఞకమైనట్లు స్పష్టపడుచున్నది.

9. వాక్యాంత గతపదములందలి ద్రుతము వైకల్పికముగ లోపించును. దీనిపై నప్పకవి వ్యాఖ్యచేయుచు: దెనుగు పద్యములతుదిని గురు వుండవలసినచోట్ల వలలపై నిత్వమును, ఉత్వమును, లాక్షణికులు చేర్పరని వ్రాసియున్నాడు.

10. ద్రుతప్రకృతికముకంటె పరమయిన పరుషములు సరళములగును. ఆద్రుతము బిందువు కూడనగును. అట్లు ద్రుతము వికారము నొందకున్నను దానిపై సరళములే నిలుచును.

11. ద్రుతప్రకృతికము కంటె సరళస్థిరవర్ణములు పరమైనప్పుడు న వర్ణమునకు లోపము వైకల్పికముగ నగును.

12. ద్రుతప్రకృతికమునకు సరళస్థిరవర్ణములు పరమైయుండ ద్రుతమునకు లోపము కలుగునప్పు డాద్రుతమునకు బైహల్లుతో సంశ్లేషమును గలుగును దీనిని బట్టి '-' అనుపొల్లే ద్రుతమయినట్లాంధ్ర శబ్దచింతామణికారుని యభిప్రాయమైనట్లు తోచుచున్నది.

13. ఇట్టిసంశ్లేషమును బొందిన ద్రుతమునకు బదులు బిందువు నగునని కొంద ఱొక్కప్పుడు పలుకుదురు.

14. సమాసములం దన్నియెడలను ద్రుతమునకు లోపము గలుగును.

పైవానిలో (3), (6), (12) ల వలన 'న్‌' ద్రుతమనియు, (5), (8)ల వలన 'న' వర్ణము ద్రుతమనియు; (4) (7) (9) (10) (11) ల వలనను వర్ణము ద్రుతమనియు, (9) వలన 'ని' వర్ణముగూడ ద్రుతమనియు నభిప్రాయము గోచరించుచున్నది.

పైనివివరించిన సందర్భములందేకాక నామవాచకములలో కన్ను, పొన్ను (బంగారము), మను, పెను, మొదలగు కొన్ని శబ్దములపై గొన్ని శబ్దములు పరమగునపుడు, కందెఱ, పొందామర, మంజిల్లి, వెంజీకటి, మొదలగు సమాసములందువలె ద్విత్వలోపమును నుకార లోపమును గలిగి యాశబ్దములు ద్రుతప్రకృతికము లగుననియు, సంధియందును సమాసమునందును ప్రాజదువు, లేగొమ్మ, సరసపుంబలుకు, మొదలగు వాని యందువలె నాగమముగా వచ్చిన నకారముగల శబ్దములును ద్రుత ప్రకృతికములగుననియు ననేకవిధముల వైయాకరణులు తెలిపియున్నారు. కావలసినప్పుడు వచ్చి, యక్కఱలేనప్పుడు లోపించునది ద్రుతమను నిర్వచనము చొప్పున ఉన్నాను లోని తుది నువర్ణము ద్రుతముకానేరదు. కన్దోయి, పెంజెఱువు మొదలగుచోట్ల నువర్ణము కేవలము లోపింపదుగావున దానిని