పుట:Andhra bhasha charitramu part 1.pdf/268

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ననుసరించి నకారపు పొల్లుపై అ, ఇ, ఉ,లు ద్రుతమునకు స్థిరత్వము గల్పించుట కేర్పడినవని యనుకొని, నకారపుపొల్లే ద్రుతమని చెప్పవచ్చును కాని, యా యా వ్యాకరణ సూత్రముల నేర్పఱుచునప్పు డాయా వైయాకరణులు న, ని, నులనుగూడ ద్రుతముగనే పరిగణింప వలసిన వారైరి.

ద్రుత ప్రస్తావననగల యాంధ్రశబ్ద చింతామణిసూత్రములలోని విషయము.

1. ప్రధమావిభక్తి, కూర్చి, కై, పట్టి, వట్టి, యొక్క. అనువిభక్తి ప్రత్యయములు, అ, ఏ, అను నేవార్థకములు ; అటయను కిలార్థకము, వింటిరి కంటిమి, వేడిరి మొదలగు తిఙ్మధ్యమములు ; కాంచి, విచారించి, కాంచక, విచారింపక మొదలగు క్త్వార్థకములు ; ఇంచుకయను కంచిదర్థకమును; ఔర, బళీ, మజ్జా, అయ్యారె, మొదలగు ప్రశంసనార్థకములును; అద్దిర. ఓహొ మొదలగు నద్భుతార్థకములును; కటకట, అక్కట, కట్ట, అయ్యో, మొదలగు సంతాపార్థకములును, 'అద్దిర' ఓహొ, మొదలగు ప్రశంసనార్థకములును అపుడు, ఇప్పుడు, ఎప్పుడు అను తదాద్యర్థకములును; ఏమి మొదలగు కిమర్థకములును; అటయను కలార్థకమును; ఇంచుక, ఊఱక, మిన్నక, మొదలగు తూష్ణీ మాద్యర్థకములును; ఆదిశబ్దముచే అయ్యా, మొదలగు సంబోధనాద్యర్థకములును గళలు. కళలు కాని శబ్దములు ద్రుత ప్రకృతములు.

2. ఆంధ్రపదాదిని 'యె' యను నెత్వవిశిష్టమైన యాద్యంతస్థ ముండును; అది ద్రుతి ప్రకృతములకు బరమందు వచ్చినచొ సంధియందు దాని కచ్చువలె గార్యమగును.

3. ద్రుతమున కచ్చుపరమగునపుడు లుక్సంశ్లేషములు లేవు.

4. వర్తమాన విహితమగు చు వర్ణముపై సంధి వైకల్పికముగా నగును; అనగా శత్రర్థక చు వర్ణము ద్రుతప్రకృతికమని యభిప్రాయము.

5. ధాతుపదసంభవములగు విశేషణములతుది యుత్వముపై నగాగమము వచ్చును. ఈ నగాగమము నప్పకవి ద్రుతముగ భావించినాడు.

6. షష్ఠీసమామునం దుత్వముపై నచ్చు పరమగునపుడు నుమ్ వచ్చును. దీనిని గూడ నప్పకవి ద్రుతముగనే భావించినట్లు తోచును.

7. శత్రర్థరూప మధ్యమందలి నువర్ణముపై నుండు నుత్వమునకు లోపమును మిగిలిన నకారమునకు బూర్ణబిందువును నగును. దీనినిబట్టి యిట్టి నువర్ణము గూడ ద్రుతసంజ్ఞకమని యప్పకవి యభిప్రాయపడినట్లు తోచుచున్నది.

8. ఆత్మాస్మచ్ఛబ్దములగు తాను, నేను, పదములందలి ద్రుతమునకు వైకల్పికముగ లోపమగును. తాను, నేను, లలోని తుది సువర్ణమాంధ్ర