పుట:Andhra bhasha charitramu part 1.pdf/265

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ననియు, నిట్టి సూత్రమె ద్రావిడ భాషలయందు, ముఖ్యముగ దెనుగున నున్నదనియు, నందుచే ద్రావిడభాషలు సిధియనుభాషలకు సంబంధించినవనియు, నార్యభాషలలో నట్టియచ్చుల యాకర్షణము లేకుండుటచే వాని కార్యభాషలతో సంబంధములేదనియు జెప్పుటకిది యొక నిదర్శనమనియు కాల్డువెలు చెప్పియున్నాడు. తెనుగున నీసూత్రము ఇ, ఉ అను నచ్చులకు మాత్రమనువర్తించునని యాతడే వ్రాయుచు నుదాహరణములుగ నీక్రింది వానికిచ్చి యున్నాడు.

కత్తి+లు=కత్తులు; కత్తికి, కత్తులకు, కలుగు+ఇ=కలిగి; కలుగుదును, కలిగితిని - కన్నడము: మాడుత్తేవె, మాడుత్తీరి, మాడిదెవు

ఈ విషయమును తెనుగు వైయాకరణులు 'ఇత్తునకు బహువచనంబు పరంబగునపుడుత్వంబగు: హరులు, గిరులు, కవులు మొద' వికృతియందికారాంతముల యుపోత్తమేత్వంబునకు బహువచనము పరంబగునపుడుత్వంబగు: కలుకులు, ములుకులు, చెలుములు, బలుములు మొద. "ఇకారంబుమీది కు, ను, వు, క్రియావిభక్తుల యుత్వంబున కిత్వంబగు: హరిని, హరికిని, శ్రీని, శ్రీకిని వారిని, వారికిని, వచ్చితిని, వచ్చితిమి, వచ్చితివి, వచ్చితిరి మొద." అను మొదలగు సూత్రములందు గుఱుతించి యున్నారు. కాని, ఈ సూత్రము సిధియను భాషలయందువలె సర్వసామాన్యముగాదు. పై సూత్రములకే యపవాదములుగ "అనుదంతమగు తెనుగు దుమంతమునకు నిగాగమము నిత్యముగానగును: మగనిని, తమ్ముని, అల్లుని, మొద" "డుమంతంబు మీది నువర్ణకంబు నుత్వంబున కిత్వంబగు: రాముని మొద"

"ఈ ధాతు యుష్మదర్థంబుల మీద వాని యుత్వంబున కిత్వంబు రాదు: ఈను, ఈము, ఈవు, ఈరు, ఈడు; ఈకుము; నీవు, మీరు, నీకు, మీకు," "రలడోపధ నవార్థాదుల యపోత్త మేత్వంబున కుత్వంబు గలుగదు: పందిరులు. పిడికిళ్లు, రాపిడులు, తొమ్మిదులు" మొదలగు సూత్రములు చేయబడియున్నవి. సిధియను భాషలలో ధాతువునందలి యచ్చులు పరుష, మృదు, అస్పష్ట భేదములచే మూడు విధములుగ నుండును ద్రావిడభాషలయం దట్టిభేద మచ్చులయందులేదు. అందచ్చుల పరస్పరాకర్షణ మాయా మిత్ర వర్గీయాచ్చులయందే కలుగుచుండును ఇదిగాక యందచ్చు లన్నిటికి నిట్టి మార్పుకలుగును. ఇంకను నందు ధాతువునందలి యచ్చుననుసరించి ప్రత్యయములోనియచ్చు మాఱునుగాని, ప్రత్యయగతాచ్చు ననుసరించి ధాతుగతాచ్చు మాఱదు. పైరీతి మా ర్పాభాషలయం దెట్టి యపవాదమును లేక కలుగుచుండును. ద్రావిడ భాషల కీవిషయములందు సిధియను భాషలతో నెట్టి సంబంధమును లేదు. తెనుగున మాత్రము ఇ, ఉ, ల విషయమున గొన్ని సందర్భములం