పుట:Andhra bhasha charitramu part 1.pdf/262

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

తెనుగని యనుకొన్నచో నా భాషయందు ప్రాకృతమునందున్న వర్ణములును దేశ్యమునకు విశిష్టములైన కొన్ని వర్ణములును జేరవలెను. కాని, ప్రాకృతమునందలి వర్ణములన్నియు నచ్చ తెనుగున జేరలేదు. అచ్చతెనుగున బ్రాకృతమందలి ఋ, :, ఖ, ఘ, ఛ, ఝ, ఠ, ఢ, థ, ధ, ఫ, భ, శ, ష - అను పదునాలుగు వర్ణములును లోపించినవి. భంగు, అవఘళించు, మజ్ఘారే, కవర, ఢాక, ధడియము, భోషాణము, మొదలగు శబ్దములలో నాయా మహా ప్రాణవర్ణములు గాన్పించినను నట్టి యుదాహరణములు క్వాచిత్కముగ మాత్రమున్నవి. ఠ, ఢ లాదియందు గల శబ్దములు మాత్రము కొంచె మెక్కువగ నున్నవి. తక్కిన మహా ప్రాణములును నన్యదేశ్యపదముల జేరి తెనుగు వ్యవహారమున జొచ్చినవి.

సంస్కృత ప్రాకృతములలో లేని తెనుగక్షరములు ఎ, ఒ, ౘ, ౙ, ఱ, ఁ, అనునవి పారంపర్యక్రమమున నాంధ్రవైయాకరణులు వ్రాయుచువచ్చిరి. అందు ఎ, ఒ, ౘ, ౙ లుప్రాకృతమున గలవని పై దెలుపబడియున్నది. శకటరేఫము సంస్కృత ప్రాకృతములందు లేదు; కాని, నేటి యార్యభాషలకు రాజస్థానీ, లహండా, సింధీభాషలలో ప్రత్యేకాక్షరముచే జిహ్నితము గాకపోయినను గొన్ని సందర్భములందు రేఫమునకు మూర్ధన్యోచ్చారణము వినబడుచున్నది. ఈ మూర్ధన్యోచ్ఛారణ మాభాషందాదినుండియు నున్నదో యిటీవల గలిగినదో చెప్ప వీలులేకున్నది. ఈ శకటరేఫ విచార మీయధ్యాయముననే మూర్ధాన్యాక్షరముల గూర్చి చర్చించునపుడు విపులముగ జేయబడును.

అస్పష్టాచ్చులు (Neutral vowels)

ద్రావిడభాషలయందెల్ల నస్పష్టాచ్చులు గలవు. ఇవి పదముల యాది మధ్యాంతములయందు చేరుచు, పోవుచు వాని రూపములను మార్చుచుండును. తమిళమునందలి 'అరశన్‌, ఇరశన్, ఇరణ్డు, ఎఱెక్కెయ్. ఉలగు, మొదలగు శబ్దములందును, తెనుగునందలి, అరమ, అరయు, ఎఱక, ఒలయు' మొదలగు శబ్దములందును మొదలచేరినయచ్చు లిట్టివే. తెనుగు పదముల మధ్యమున అకార ఉకారములు చాలవఱకు ననిర్ధారితములుగ నుండుటకు వానియుచ్చారణ మిట్టిదని తెలియకుండుటయే కారణము. ఉదా: నిలకడ, నిలుకడ; పడక పడుక; పడమర, పడుమర మొద. పదాంత మందుండు నచ్చులు చాలవఱకు నిలుకడలేక యుండునవే. తెనుగుభాష యజంత భాషయని కొందఱందురు. నేటి తెనుగు చాలవఱకజంతమని చెప్పవచ్చునుగాని ప్రాచీనాంధ్రము తక్కిన ప్రాచీన ద్రావిడభాషల