పుట:Andhra bhasha charitramu part 1.pdf/190

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

తేలినవి. సంస్కృతముతో ద్రావిడభాషలకు సంబంధము లేదను దృష్టితో పరిశీలించుటవలన నాతని కత్తిరింపులన్నియు దప్పయినవి. పదములనుండి ప్రత్యయములను వేఱుచేయు సందర్భములందు వారు సిధియను భాషా ప్రత్యయములతో సంబంధించు ప్రత్యయములు వచ్చునట్లు ప్రయత్నించుటచేత, సంస్కృత ప్రాకృత భాషలతోడి సంబంధము తెగిపోయినది; ఎంత కష్టించినను సిథియను భాషలతోడి పొత్తు కుదిరినదికాదు. తరువాతి పరిశోధకులును కాల్డువెల్లు ననుసరించియు సిధియను భాషలతోడి సంబంధమును గానక, సంస్కృత ప్రాకృత భాషలతోడి సంబంధమును విచారింపక, కొంద ఱాస్ట్రేలియాభాషల వంకకును, గొంద ఱిందో-చీనాభాషలవంకకును, గొందఱాస్ట్రికుభాషలవంకకును దృష్టిసారించి ప్రయత్నించుచున్నారు గాని, వారికింకను సరియైన సూత్రములభింపలేదు. కొందఱీ ప్రయత్నమంతయు వ్యర్థమని తలంచి ద్రావిడభాషలు ప్రత్యేకభాషా కుటుంబముగ నేర్పడవలెననియు, వానికిని నితరభాషా కుటుంబములకును, సంబంధము గాన్పింపదనియు జెప్పి తృప్తినొందుచున్నారు. ఇట్టి నిస్పృహజెందక పూర్వము, ప్రాకృత భాషలతోడి సంబంధమును విచారించుట మంచిది.

ప్రాచీనార్య భాషలలోని ప్రత్యయము లనేక విధములుగ మార్పు నొందియు, కొన్నియెడల సంపూర్ణముగ లోపించియు నేటి భారతీయ భాషల యందు గుర్తిపరాక యున్నవి. కాని, కొన్ని యింకను నట్లే మిగిలియున్నవి. ప్రయత్నించినయెడల గొన్నిటినింకను పోల్చుకొనవచ్చును. కర్మ, బ్రహ్మ, శబ్దములు- అన్ అంతములనియు, జామ=జంబూ ఆమ (వడ)= ఆమ్ర, అనియు, ఇప్పుడు సాధారణజనులకు గోచరింపదు. ఇట్లె 'పోట్ల-మారి' మొదలగు శబ్దములలోని 'మారి' ప్రత్యయము మతుప్ప్రత్యయవికారమని కాని,- కాడు, కత్తె, కోలు, మొదలగునవి 'కృ' ధాతుభవములని కాని, కొంతయూహ చేసినచో దెలిసికొనవచ్చును. -ట, అట, అటము, అడము, అణము, ఆట, ఆటము, ఆడము, ఆణము, మొదలగునవి సంస్కృతములోని తప్రత్యయ పరిణామరూపములనియు 'టి, డి,' మొదలగునవి తిప్రత్యయ వికారములనియు గొంత ప్రయత్నముతో బోల్చుకొనవచ్చును. క, ఇక, అక, మొదలగు ప్రత్యయములింకను సంస్కృతమునందువలెనే నేటికిని దెనుగున వాడుకలో నున్నవి.

ఈ క్రింద దెనుగున గనబడు కృత్తద్ధిత ప్రత్యయము లకారాదిగా చూపబడినవి. వానికి సంస్కృత ప్రాకృతములలోని రూపములును, నేటి యుత్తరహిందూస్థాన భాషలలోని రూపములును, ఇతరద్రావిడ భాషలలోని రూపములును సాధ్యమయినంతవరకు బొందుపఱుప బడినవి.