పుట:Andhra bhasha charitramu part 1.pdf/182

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


ఉపసర్గములు - ప్రత్యయములు

ఉపసర్గములు

సంస్కృతములోని యుపసర్గములు ప్రాకృతములో బదములతో నేకమై వికృతినొందుచు దమ యుపసర్జనత్వమును గోలుపోయినవి. నేటి యుత్తరార్యభాషలలోను, ద్రావిడ భాషలలోను నిట్లే జరిగినది. సంస్కృతములోని యుపసర్గములు నేడు భారతీయభాషలయందు గానరావు. ప్రతి, పరి, యను నుపసర్గములు మాత్రము వాడుకలో దద్భవ దేశ్యములతో గలసి యుపయోగింపబడుచున్నవి. ఉదాహరణములు:- ప్రతిమాట, ప్రతిపల్లె. కొన్నియెడల సంస్కృత శబ్దములతో గూడ గ్రొత్తయర్థములం దీయుపసర్గ ముపయోగింపబడుచున్నది. ఉదా. ప్రతిమనుష్యుడు, ప్రతిగ్రామము. కొన్నియెడల నీ యుపసర్గము తుదియచ్చు దీర్ఘమును బొందును. ఉదా. ప్రతీమాట, ప్రతీమనుష్యుడు ఈదీర్ఘమువలన నర్థభేదము గలుగుచున్నది. ఈ యుపసర్గమును బ్రత్యేక విశేష్యముగ గూడ బ్రయోగించుట గలదు. ఉదా. ఆమాటకు ప్రతిలేదు: (అతనికి) బ్రతి రఘవీరు డొకడు (విజయ,); ఈపుస్తకము మున్నూఱుప్రతు లచ్చయినవి; ఈ యుత్తరమునకు బ్రతివ్రాయించు; యతికి బ్రతి; ఎవ్వారు నీ ప్రతిలే రీభువనత్రయంబున. (హరి. ఉ-10.ఆ); ఏను నీ ప్రతిగ నర్చన చేసెదగాని శాంభవికీ. (జై. 7. ఆ.) ఇట్లే పరిగొను = చుట్టుకొను; పరిపరి = చాలవిధముల; ఒకపరి = ఒకసారి; (వాడుకలో "ఒకసారి" యనియుగలదు); పొరి బొరి= పరిపరి; పరిఘాణించు, పరిఘాతించు యనువానిలో పరియను నుపసర్గము గాంపించుచున్నది. 'అనసడి,' అపనమ్మకము, అపదూఱు, నిబద్ధి, నిబ్బద్ధి" మొదలగు వానిలో నుపసర్గములతో గూడిన తద్భవపదములు చేరినవి.

ఈక్రింద నాయా యుపసర్గము లెట్లు ధాతువులతో గలసి, వికారము నొంది, దేశ్యములుగ బరిగణింప బడినవో తెలుపుట కుదాహరణము లీయబడుచున్నవి.

1. అతి=అడి. ఉదా. అడిసిగ్గు=అధికమైనసిగ్గు; అడిసిగ్గులు తమకంబులు నుడివోవగ. మార్క 8. ఆ. అడి బీరపు దులువగెలుచునటె పాండవులన్. భార. ద్రో. 4. ఆ.; అడిత్రాగుడు=అతితృష్ణా=కఱవు. అడి త్రావుడనక యిప్పటి కడిదికి నేమాంసమైన గ్రక్కున గొనిరండు; పంచ. నా. 1. ఆ; అచ్చాళు=అత్యాచార. ఆరూడబలయుక్తి నచ్చాళుగాగ, ననికి సన్నద్ధులమై యుందమవల=విచ్చలవిడిగ; ఐమూల=అతిమూల.