పుట:Andhra bhasha charitramu part 1.pdf/18

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

డాభాషలకును లాటినునకును నెట్టి సంబంధమును లేని సందర్భములలో గూడ లాటిను వ్యాకరణసంజ్ఞల నుపయోగించుచు వచ్చినారు, ఇంగ్లీషు, డేనిషు, భాషలలో ద్వితియా, చతుర్థీ, పంచమీ విభక్తి ప్రత్యయములు లేకున్నను నా భాషల వ్యాకరణములలో నా విభక్తులను జేర్చినారు. విచక్షణత లేకుండ నన్ని భాషల వ్యాకరణములలోను క్రియాప్రక్రియయంతయు లాటిను వ్యాకరణము ననుసరించి చేరినది. అందుకోస మాయాభాషల నిజస్థితికి మార్పు, కూర్పు, చేర్పులు కలుగవలసి వచ్చినది. ఆ యా భాషలలో లేని విషయములను లాటిను భాషలో నున్నవిగదా యని చేర్చుట, లాటినులో లేవనుకారణముచేత నా భాషలలో నుండు విషయములను వదలిపెట్టుటకూడ జరిగినది. లాటిను వ్యాకరణప్రమాణముతో నితర భాషలనుగూర్చి యోచించుటయిప్పటికిని సంతరించలేదు. చాల వ్యాకరణములలో లాటిను భాషావ్యాకరణదృష్టి యిప్పటికిని కనబడుచునే యున్నది.

లాటినుభాషను వ్రాతమూలముగా నేర్పుచు, నుచ్చారణమును గుఱించి శ్రద్ధ తీసికొనకపోవుటచేత నక్షరములే ప్రధానములయినవికాని, ధ్వనులకు బ్రాధాన్యము కలుగలేదు. పదియాఱవు శతాబ్దమునాటికే ఫ్రెంచి విద్వాంసులును, ఇంగ్లీషు విద్వాంసులును నొకటేలాటినుభాషలో పాండిత్యము సంపాదించియున్నను, నా భాషలో సంభాషణ చేయునప్పు డొకరిమాట లొకరికి బోధపడకుండ నుండెడివి. భాషింపబడునదేభాష, వ్రాతలోనున్నది భాషకుసరియైన గుఱుతుకాదు. భాషాజీవము నోటిలోను, చెవిలోను నున్నది; కలములోను, కంటిలోను లేదు, అను విషయము నానాటి విద్వాంసులు గ్రహింపలేదు. ఇందువలన భాషాతత్త్వము, భాషా పరిణామములగూర్చి సరియైన జ్ఞానము కలుగలేదు. ఒకభాషను మాట్లాడనేర్చుకొనుట కవకాశములున్నను పండితులు దానిని చదువుటతోనే తృప్తిపడుచుండెడివారు. భాష ధ్వన్యాత్మకమను సంగతి పదియాఱవు శతాబ్దమునుండియు భాషాతత్త్వవాదులకు సంపూర్ణముగా నిప్పటికిని పట్టువడలేదు. స్వరశాస్త్రమునుగుఱించి ఎక్కువగా నిప్పుడు కృషిజరుగుచున్నది. కాని, భాషనుగుఱించి వ్రాసినప్పటికిని చాలమంది యక్షర విన్యాసమునుగూర్చి యాలోచింతురుగాని, ధ్వని పరిణామమును గుఱించి యాలోచింపరు. వారు తాము వ్రాసినదానిని మరల చదువుకొన్నప్పుడు తబ్బిబ్బులు పడుటకూడ తటస్థించుచుండును. "పరిశోధకునికి సర్వశాస్త్ర శిక్షణము లేకపోవుటవలన ముఖ్యమయినభాషాశాస్త్ర విషయములను, సూత్రములను, విడిచిపెట్టుటయో, తార్మారు చేయుటయో, జరుగుచున్న దన్నందు కనేకోదాహరణములను చూపవచ్చును. స్ల్కీకరుపండితుడు లిథుఏనియను భాషలోని స్వరములను గుర్తించకపోవుటయు, కుర్షాటుపండి