పుట:Andhra bhasha charitramu part 1.pdf/177

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

వలన గలిగిన క్రియారూపములు నానాటాకి మార్పులజెంది, యాయా రూపమును బొందుటచే, ఉపసర్గ, ధాతు, వికరణ, ప్రత్యయ విభాగ మస్పష్టమగుచు వచ్చెను. ఈ లోపున భూతకాలధాతుజ కర్మణి విశేషణము ప్రాధాన్యము వహించెను. 'సోగచ్ఛత్' అనుటకు 'స గత:' అనునట్టి రూపములే సాధారణము లయ్యెను. ఈ-'త' ప్రత్యయము గల విశేషణములే ప్రాకృతమునను నేటి యార్యభాషలయందును బ్రత్యేక క్రియాప్రాతిపదికములుగ నిలుచు చుండ, పూర్వపు క్రియాప్రాతిపదికము లంతరించుచు వచ్చెను. ఈ-తప్రత్యయము ప్రాకృతములయందు అ, య, డ, ర, ల, ళ లుగా మాఱుచు వచ్చెను. 'గత' అను రూపమున కా యా ప్రాకృతములందు 'గఅ, గయ, గద, గడ, గఇర, గఇల, గఇళ, అను రూపము లేర్పడెను. వీనిపై దిరిగి పురుష, వచన, లింగబోధకములగు ప్రత్యయములు చేరుచు వచ్చెను. సంస్కృతభాషకు బ్రాకృతములద్వారా నేటి యార్యభాషలయందు గలిగిన పరివర్తనమునకు గారణము ద్రావిడభాషలతోడి సంపర్కమేయని కొందఱమతము. సహజముగనే యిట్టి పరివర్తనము గలిగినదని మఱికొందఱ మతము.

ఈ రెండవమతమే సమంజసమయినట్లు తోచుచున్నది. ప్రాచీన ప్రాకృతములు వ్యవహారభాషలుగ నుండిన నాటి ద్రావిడభాషల స్వరూపమును దెలిసికొనుట కాధారములులేవు. ద్రావిడభాషలస్వరూపము దెలిసికొనుటకు శాసనాద్యాధారములు గోచరించిననాటికి ప్రాచీనప్రాకృతములు వ్యవహారభ్రష్టములై, కేవలగ్రంధములయు, వ్యాకరణములయు సాహాయ్యముననే తెలిసికొన వీలగుచుండెను. సంస్కృతమును బ్రాకృతభాషలుగను, బ్రాకృతములను నేటియార్యభాషలుగనుమార్ప గలిగిన యాద్రావిడాభాషాస్వరూప మెట్టిదియో తెలియదు. ద్రావిడభాషల సంపర్కమున బ్రాకృతభాష లేర్పడినవనుట సరికాదు. సంస్కృతమునుండి ప్రాకృతములుగలిగిన మార్గముననే ద్రావిడప్రాకృతమును నేల కలిగియుండరాదో తెలియదు. ఏయేపద్ధతులపై సంస్కృతమునుండి ప్రాకృతము లుప్పతిల్లినవో, యాపద్ధతులనే యవలంబించినచో ద్రావిడభాషారూపములనుగూడ సంస్కృతజన్యములుగ నిరూపింపవచ్చును.

ఈ సందర్భమున నొక విషయమును మఱచిపోగూడదు. సంస్కృతము నుండియే ప్రాకృతములు పుట్టినవనుట పొరబాటు. సంస్కృతమును నొక ప్రాకృతభాషయే. దానిని సంస్కరించి వ్యాకరణబద్ధముగ జేయుటచే దానికి సంస్కృత మనుపేరు గలిగెను. దానితో సంబంధించినను, కేవలము దాని నుండియే యుద్భవింపని యనేక ప్రాకృతభాషలు ప్రచారమందుండెను.