పుట:Andhra bhasha charitramu part 1.pdf/15

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

అనగా 'విశేషవిభక్తి' అను నర్థమున వాడినదానిని 'జెనిటివుస్‌' (genitivus) 'ఉత్పత్తివిభక్తి' అను నర్థమునను, 'ఐతిఆతికె' (aitiatike) అనగా కర్మవిభక్తి యను నర్థము కలదానిని 'ఐతిఆఓమై' (aitiaomai) 'నిందించుచున్నాను' అను నర్థమునను వాడినారు. తరువాతికాలమున నలగ్జాండ్రియా పట్టణమున వైయాకరణులు బయలుదేరినారు. పూర్వకవుల కావ్యముల కర్థము దుర్గ్రాహముకాగా, వాని కర్థము చెప్పుటయే వీరి ముఖ్యోద్దేశమయ్యెను. వీరు విభక్తి విశేషములను గుఱించియు, మాటల యర్థములను గుఱించియు కృషిచేసి, సామ్యము, సామ్యరాహిత్యము, అను రెండు విషయములనుబట్టి యాయా విభాగములను చేసినారు. కాని, భాషాస్వభావమును గూర్చిన జ్ఞానము నలగ్జాండ్రియా వైయాకరణులుగాని, వారి ననుసరించిన తరువాతి రోముదేశపు వైయాకరణులుగాని వృద్ధిపొందింపలేదు. అందుచేత చాలకాలమువఱకును వ్యుత్పత్తి శాస్త్రము (నిరుక్తము) బాల్యావస్థలోనే నిలిచిపోయినది.

ఐరోపాలో మధ్య యుగమున గూడ భాషాశాస్త్ర మభివృద్ధి పొందలేదు. చర్చి ప్రాబల్య మెక్కువగా నుండుటచేతను, చర్చి అవలంబించిన భాష లాటినుభాష యగుటచేతను, లాటినుభాషను, ఆనాటి నాగరకతనుగుఱించియు మాత్రమే యా కాలములో కృషిచేయుచుండెడివారు. కాని, ఈలాటిను భాష నప్పటిపండితులు శాస్త్రదృష్టితో పరిశీలింపలేదు. ఒకదాని తరువాత నింకొకటిగా బొడచూపుచుండిన దేశభాషలనుగుఱించి వారు మొదలే యాలోచింపలేదు.

మధ్యయుగ మంతరించిన వెంటనే యైరోపాలో జాతీయోజ్జీవనము కలిగినది. అందుమూలమున నన్నివిషయములందును విశాలదృష్టి యుదయించినది. లాటినుభాషకు దోడుగా గ్రీకుభాషకు గూడ ప్రాముఖ్యము కలిగినది. లాటినువాఙ్మయమున నుత్తమగ్రంథపఠనము మూలమున ప్రమాణ లాటినుభాషా పరిశోధనము హెచ్చయి వ్యాకరణము గూర్చిన కృషి ప్రబలినది. పండితు లందఱు నప్పటినుండియు సిసెరో వ్రాసిన లాటినుభాషను పరమలక్ష్యముగా నుంచుకొని, యతనివలె వ్రాయుటకు ప్రయత్నములుచేయ నారంభించిరి. ఈ లోగా దేశభాషలలో వాఙ్మయ సృష్టి కలుగుటచేతను, వాని ప్రాధాన్య మెక్కువ యగుచుండుటచేతను, నంతర్జాతీయ సహవాసమును వ్యాపారమును నభివృద్ధి యగుటచేతను, ఐరోపాలోని దేశభాషలను గూర్చిన వ్యాసంగ మభివృద్ధి యయినది. ఈ కాలముననే ముద్రణ యంత్రనిర్మాణము జరిగినది. ఇందుమూలమున దేశభాషలను చదువుట కవకాశములు హెచ్చయినవి. బైబిలు ప్రాచీనభాగమునకు మూలముహీబ్రూ