పుట:Andhra bhasha charitramu part 1.pdf/146

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

(3) ఒకప్పుడు సంయుక్తాక్షరములలోని మీదిహల్లు క్రింది హల్లుగ మాఱిపోవును. మౌక్తికమ్ = మోత్తిఅమ్.

(4) సంయుక్తాక్షరములలోని క్రింది హల్లు లొకప్పుడు మీది హల్లుగా మాఱును. అగ్ని = అగ్గి.

(5) కొన్ని సంయుక్త హల్లుల మధ్యమున నొక యచ్చు చేరును. తామ్ర = తంబిర.

(6) కొన్ని సంయుక్తాక్షరములందలి యొక హల్లు రెండవ హల్లగు ఝయ్‌గా మాఱి నప్పుడు దానికి వర్గద్వితీయాక్షర మాదేశమగును: నమస్కార = ణమోఖ్ఖార.

(7) కొన్నియెడల సంయుక్తాక్షరములు తమ స్థానములను మార్చుకొనును. గ్రీష్మ = గిహ్మ = గింహ.

ఇట్టి విశేషము లింక నెన్నియో యున్నవి. అవి యాయా ప్రకరణము లందు తెలుప బడును.

సంస్కృత ప్రాకృతములు.

క్రియలు.

వేదభాషలో గ్రియాధాతువులకు దశవిధలకారములు, దశవిధవికరణములు, ఆత్మనే - పరస్తైపదవిభాగము, ఉపసర్గలతోడి కూడిక, మూడు వచనములు, నుండెడివి. లకారములలో లేట్టు సంస్కృతములోనే లోపించినది. తక్కిన లకారములలో లిట్, లుజ్, రూపములు ప్రాకృతములలో లోపించినవి. మిగిలినరూపములు వేర్వేఱు వికారములను పొంది, యనేక లకారము లేక రూపమును బొంది లకారజ్ఞానమే లోపించినది. ఉపసర్గలు ధాతువుతో గలిసి వికారమునొంది, యిది యుపసర్గ, యిది ధాతువు, ననియేర్పఱించుటకు సాధ్యముకాకుండ నయినది. ఆత్మనేపద ధాతువులు పరస్తైపద ప్రత్యయములనే రాను రాను స్వీకరించి, తుదకొక్క పరస్తైపద ధాతువర్గముక్రింద నేర్పడినవి. మూడువచనములలో ద్వివచనము లోపించినది. ఈ రూపములన్నియు నేక రూపమును దాల్చుటచే గ్రొత్తధాతువు లేర్పడి, లకారాదివిశేషములను దెలుపుటకు గ్రొత్తశబ్దమును బ్రత్యయములను వానికి జేర్పవలసి వచ్చినది. నేటియుత్తరహిందూస్థాన భాషల యవస్థ యిట్లేయున్నది. ఈ యవస్థ ద్రావిడభాషలలోని క్రియారూపనిష్పత్తి యవస్థనే పోలియున్నది.

ద్రావిడభాషలలోని ధాతువు లేకమాత్రాకములనియు, వానికి గ్రమముగ శ్రుతినుభగత్వమునకును, నుపవిభక్తిత్వమునకును, నకర్మక సకర్మకత్వమునకును, లింగ, పురుష, వచనములకును వరుసగ బ్రత్యయము లొకదాని