పుట:Andhra bhasha charitramu part 1.pdf/138

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


సంస్కృత ప్రాకృతములు.

ఆంధ్రశబ్దముల వ్యుత్పత్తిని సరిగ నిర్ణయించుటకు సంస్కృత ప్రాకృత ధ్వనులకుగల సంబంధమును, ప్రాకృతాంధ్రముల ధ్వనులకుగల సంబంధమును ముందుగ దెలిసికొనవలెను. ఈ మార్పులను గమనింపక పరిశోధకు లింతవఱకు గేవలద్రావిడదృష్టితోడనే వ్యవహరించియున్నారు. సంస్కృత ప్రాకృత దృష్టితో గూడ బరిశోధనలను సాగించినచో నేమి తేలునో యను నుద్దేశముతో చేయబడిన కృషి కీ యధ్యాయము ఫలితము. ఇందు పొందు పఱుపబడిన దంతయు సిద్ధాంతమని తలంప గూడదు. అది యాంధ్ర విద్వాంసుల దృష్టిని క్రొత్తమార్గమునకు మఱలింపజేసిన ప్రయత్నము గాని వేఱుగాదు.

ఈ క్రింది పట్టికలలో సంస్కృత ధ్వను లాయాప్రాకృతములలో నెట్టి మార్పులబొందినవను విషయము నేటి కచ్చుపడిన ప్రాకృత వ్యాకరణముల సహాయమున నిర్ణయింప బడినది. ఈ పట్టికలు పరిశోధకులకు మున్ముందు సహాయపడగలవని తలంచెదను.