పుట:Andhra bhasha charitramu part 1.pdf/133

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఉపోద్ఘాతమున కనుబంధము.

(i) 1931-జనాభా నివేదికలో తెనుగును గూర్చి వ్రాయబడిన యంశము లీక్రింద సంగ్రహముగా చూపబడినవి:-

"మాతృభాషయనగా నేమి?"

"1921-సంవత్సరమున జనాభా తీసికొన్నప్పుడు 'మీ మీయింట సాధారణముగా నేభాష మాట్లాడుకొందురు ? అని అడుగుచుండిరి. ఈ (1931) జనాభా సమయమున "నీ మాతృభాషయేమి?" అని అడిగిరి. మాతృభాష యేది యను విషయమున నెవ్వరు నెట్టి సందేహమును పడనక్కఱలేదని యెంచుచుందురు. కాని, జాతులును భాషలును నొకదానితో నొకటి కలియుచుండు నీదేశమున సాంఘికాచారము లందును, మత నియమములందునువలె భాషా విషయమున గూడ మాతృభాష యిదమిత్థమని చెప్పుట కష్టమగుచుండును. కావున, నీ విషయమున నెట్టి ప్రశ్ననువేయుట అను విషయమై నిర్ణయించుట కొంచెము కష్టమయ్యెను. సాధారణ మనుష్యుడు సరియైన ప్రత్యుత్తరమిచ్చుటకు సరియైన, సూత్రప్రాయముగనుండు ప్రశ్నను కోరుచుండును. కొంద ఱీ విషయమున నెట్టి ప్రశ్నలకును లొంగకుండిరి. "తమిళుడు తెనుగు స్త్రీని పెండ్లాడిన వారిసంతానముభాష యేమగును?" అని యొకడు ప్రశ్నించును. గంజాము జిల్లాలో తెనుగును ఒఱియాయు గలియుచోట, తెలుగు ఒఱియాభాషల రెండింటిని గూడ మాట్లాడు తెగలవారున్నారు. ఒకటే కుటుంబములోని జనుల పేళ్లలో ఒఱియాపేళ్ళు, తెనుగు పేళ్లుకూడ వినబడుచున్నవి; తెనుగువారిలో నుండు ఇంటిపేళ్లు అట్టివిలేని ఒఱియా కుటుంబములలో వినబడుచున్నవి. అట్టి జనులు తమ మాతృభాష యేది యని యడిగినప్పుడు సరిగ చెప్పలేరు. తమ పూర్వులనుండి యా విషయమై తెలిసి యుండలేదు; తెలిసికొనుటకు వారికి జాలినంత విద్యయులేదు. చిన్ననాటనుండియు వారు రెండుభాషలను మాట్లాడుచునే యున్నారు. "నీ వింటిలో ఏ భాష మాట్లడెదవు?" అని తొలిసారి యడుగగా 'తమిళము' అని చెప్పిన వాడు, నా యెదుటనే తిరిగి 'నీమాతృభాషయేది?' అని అడిగినప్పుడు 'తెలుగు' అని ప్రత్యుత్తరమిచ్చెను. ఈతడు తెలుగువాడు; తెలుగురాని తమిళ స్త్రీని పెండ్లాడినాడు; కాబట్టి, గృహకృత్యములు సరిగ జరుగుటకు భార్యభాషను నేర్చికొని, ఇంటిలో తమిళమును మాట్లాడుచున్నాడు. కడపజిల్లాలో ఒక సూపర్వెజరు తన ప్రశ్నకు సరియైన సమాధానము చిక్కక, "నీ తల్లిపాలతో ఏ భాషను త్రాగినావు?" అని ప్రశ్నించినాడు. ఈ ప్రశ్నకు వెంటనే సరియైన సమాధానము వచ్చినది.

ii. ఉపభాష.

ఒక భాష మాతృభాషగా గలవారు కొందఱు ఇతరభాషాప్రదేశనివాసమువలను, వ్యవహారవశమునను మఱియొక, లేక కొన్ని, భాషలను నేర్చి యుండవచ్చును. అట్లు నేర్చిన యితర భాషల కుపభాషలని పేరు.