పుట:Andhra bhasha charitramu part 1.pdf/114

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

యుండెను. ప్రాచీన ఇండో-ఆర్య భాషలయందలి సంయుక్త హల్లులు హల్తైత్రి (Assimilation) వలన నేక స్వరూపమును బ్రాకృతభాషల యందు పొందుట ప్రాకృత భాషలయందే కలిగియుండవలెను. ఇట్లగుట ఇటాలికు భాషయందును మఱికొన్ని ఇండో-యూరోపియను భాషలయందునుగూడ గలిగెను. కాని ఈ మార్పు ద్రావిడభాషల యందుకంటె నిండో-ఆర్యభాషలలో వేయు సంవత్సరములకు బూర్వమే సంభవించెను. ఇండో-ఆర్యభాషల చరిత్రమున ద్రావిడు లార్యభాషను చాల ప్రాచీనకాలముననే యవలంబించుటయు నార్యభాషలతో ద్రావిడమునకు సంబంధము గలుగుటయు దీనికి కారణమై యుండును.

చ, జ, లు, ౘ, ౙ లుగను, సకారము హకారముగను నచ్చులమధ్యనుండు పరుషాక్షరములు సరళాక్షరములుగను మాఱుటయును, నంత్యాచ్చులు లోపింపక నిలుచుటయును, మొదలగు విషయములందు ప్రాకృతభాషలకు ద్రావిడాభాషా సంపర్కము కారణమని గ్రియర్సన్ పండితుడు చెప్పియున్నాడు. కకారతకారములు గకార దకారములుగ నచ్చులమధ్యమున మాఱుట ప్రాకృతభాషలయందే సహజముగ గలిగియుండును. కొన్నిప్రదేశములలో ద్రావిడభాషాసంపర్కము గూడ నుండియుండవచ్చును.

శబ్దనిర్మాణము.

1. ఉపసర్గలు నానాటికి నిండో-ఆర్యభాషలయందు లోపించినవి. తక్కిన ఇండో-యూరోపియను భాషలలో నుపసర్గలు నుప్తిజ్‌విధానమున దోడ్పడినవి. నుప్తిజ్ ప్రత్యయము లంతరించినపిమ్మట నింగ్లీషు, పెర్షియను, ఫ్రెంచి, బల్గేరియను, భాషలయందువలె నుపసర్గలు వానిస్థానము నాక్రమించును. దాతువులకర్థభేదము గలిగించు నుపసర్గలు పై భాషలలో నింకను నున్నవి. ప్రాచీన ఇండో యూరోపియనుభాషలలో నుపసర్గలు తొలుత సవ్యయములుగానుండి క్రియకుముందుగ గాని వెనుకనుగాని చేరుచుండును. ఇండో-ఆర్యభాషలలో నుపసర్గము సంపూర్ణముగ నంతరింప లేదుగాని యది క్రియకు దరువాతనే వచ్చుటను గమనింపవచ్చును. ఇట్లే ప్రాకృతము లందును నాధునికార్యభాషలయందును విశేష్యముల నుండియు గ్రియలనుండియు బుట్టిన కొన్నిసహాయక పదము లుపసర్గల స్థానమున జేరుటయు గమనింపదగును.

ఆధునికార్యభాషలలో నుబ్విదానము ద్రావిడభాషలందలి దాని నెక్కువగ బోలియున్నది. బహువచనమున గణ, గులా (కులా), సబ్ (సర్వా), మాన (మానవ), లోగ్ (లోక), సకల, మొదలగుశబ్దములు