పుట:Andhra bhasha charitramu part 1.pdf/112

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ధము మిక్కిలి సన్నిహితమైన దనియు నాతని యభిప్రాయము. ఇండోయూరోపియను భాషలతో సంబంధము లేదని యాతడు చూపిన వివరములతో దఱువాతి పరిశోధకు లేకీభవించి యా సిద్ధాంతమునందు స్థిరమగు విశ్వాసమును గలిగియున్నారు. కాని, సిధియనుభాషా కుటుంబముతో గూడ ద్రావిడమునకు సంబంధములేదని వారు కాల్డ్‌వెల్ సిద్ధాంతమును త్రోసిపుచ్చి యున్నారు. కాల్డ్‌వెలును దక్కిన పండితులును ద్రావిడభాషలు మిక్కిలి ప్రబలమయినవనియు, వానిమూలమున భారతీ యార్యభాషలలో గొప్పమార్పులు గలిగినవనియు, నా మార్పుల మూలమున నాయా యార్యభాషల ప్రాచీనస్వరూపమే మాఱినదనియు దలంచుచున్నారు. ద్రావిడభాషాప్రబల్య మార్యభాషలపై గలిగిన సందర్భములని తనకు దోచినన వానిని సునీత్‌కుమార్ ఛాటర్జీ యను బంగాళీ పండితుడు తాను రచియించిన "బంగాళీ భాషోత్పత్తి తత్పరిణామము" (The Origm and Development of the Bengali Language.) అను గ్రంధమున నిట్లు వివరించియున్నాడు:-

1. ఉచ్చారణము

1. ఈ రెండుకుటుంబములలోను ద్వ్యచ్ సంయోగముగల యచ్చులు చాల కొంచెముగా నున్నవి. ఉద్వృత్తాచ్చుల నడుమ య, వ, లను చేర్చి వైదిక భాషయందును, సంస్కృత భాషయందును ప్రకృతిభావము లేకుండ జేసియుందురు. అచ్చులనడుమనుండు హల్లులు లోపించినప్పుడు ప్రాచీన ప్రాకృతభాషావస్థనుండి నేటివఱకును నిట్లే జరుగుచున్నది. జైన అర్థమాగధీభాషలో నుద్వృత్తాచ్చుల నదుమ యకారమును వ్రాయుచుండెడివారు. తక్కిన ప్రాకృతభాషలలో నాహల్లును వ్రాయకుండినను నుచ్చారణములో నది వినబడియుండవలెను. తాలవ్య, ఓష్ఠ్యాచ్చులనడుమ య, వ, లును నకారమును జేరుట ద్రావిడభాషలయందును గలదు

2. జారుడు ధ్వనులు నేటి ఇండో-ఆర్యభాషల యందును గూడ నెక్కువగా లేవు. ఇండో-ఐరేనియనులోని 'ౙ', ౙ=Z, Zh, ధ్వని జ, ఝలుగ మాఱుట ద్రావిడభాషాసంపర్కమువలన గలిగియుండును కాని ఘ, ఝ, ధ, భ, యను హల్లులు హకారముగా మాఱుట ఋగ్వేద భాషకు మూల భాషయగు నై రేనియనుభాషకు దగ్గఱగానుండిన యొక ప్రతీచీభాషకు లక్షణముగానుండెను. ఐరేనియను భాషలో జారుడు ధ్వను లెక్కువగా నుండెను.

3. రెండు కుటుంబములందును మూర్ధన్యాక్షరము లున్నవి. ట, డ, ణ, ళ, ఱ యనునవి ద్రావిడభాషాధ్వనులు . ఇవి వేద, సంస్కృతభాషలయందు తప్ప మఱి యే ఇండోయూరోపియను భాషయందును లేవు. ఆధునిక