పుట:Andhra bhasha charitramu part 1.pdf/107

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

చెను. కావున గ్రంధస్థ ప్రాకృతము లెంతవఱకు వ్యవహారరూపక భాష కుదాహరణములో జెప్పవీలులేదు. కాని అశొకుని శాసనములవలనను నితరాధారములవలనను నీప్రాకృతములందు ప్రాచ్యప్రతీచ్య భేదములు రెండుండెనని చెప్పనగును శౌరసేనీభాష ప్రతీచ్యప్రాకృతము. మాగధీభాష ప్రాచ్యప్రాకృతము. ఈరెండింటికిని మధ్యమున నుభయలక్షణసహితమయిన యర్ధ మాగధీభాష యొకటియుండెను. జైనమతకర్తయగు మహావీరు డుపయోగించిన భాష యిదియే. జైనగ్రంధము లీభాషయందే వ్రాయబడియున్నవి. ఈ యర్ధమాగధీభాషకు సంబంధించి ప్రతీచ్యభాషాలక్షణములకంటె ప్రాచ్యభాషాలక్షణములనే యెక్కువగా గలిగియుండినభాష మాహారాష్ట్రీ భాష. ప్రాకృతకవిత్వ మీభాషలో నెక్కువగ వెలువడినది.

సంస్కృతము వైయాకరణుల మూలమున స్థిరపడినట్లే, ప్రాకృతములు గూడ గ్రంధస్థములును లక్షణనిబద్ధములునై స్థిరత్వమునుబొందెను. కాని, వ్యావహారిక ప్రాకృతములు పరిణామము నొందుచునే యుండెను. ఈప్రాకృతములందాయా దేశముల శబ్దజాలము చేరుచు దేశ్యపదములసంఖ్య నానాటికిని భ్రాకృతములందు హెచ్చు కాజొచ్చెను. ఈరీతిగ గొన్ని యపభ్రంశ భాష లేర్పడెను. ఈ భాషలలో నాగరాపభ్రంశమను భాషయందు గ్రంథములు వెలువడజొచ్చెను. ఇట్లపభ్రంశభాషలయందే గ్రాంథిక వ్యావహారిక భేదములుకలిగెను. వ్యావహారికాపభ్రంశములు మాఱుచు వేర్వేఱు ప్రాకృతములుగ నేర్పడెను. సింధునదీ దక్షిణప్రాంతముల వాడుకలోనుండిన యపభ్రంశమునకు 'వ్రాచడ' మనిపేరు. దీనినుండియే నేటి సింధీ, లహందా భాషలు పుట్టినవి. వీనితో బైశాచభాషాసంపర్కముగూడ గలిగెను. నర్మదానదికి దక్షిణమున నరేబియాసముద్రమునుండి యొరిస్సావఱకును వైదర్భ లేక దాక్షిణాత్యాపభ్రంశభాష యుండెను ఈదేశమునకు మహారాష్ట్రమనిపేరు. ఈ దేశమందలి యపభ్రంశమును నితరాపభ్రంశమును నేటి మరాఠీభాషకు మూలములు దాక్షిణాత్యాపభ్రంశమునకు దూర్పుగా బంగాళాఖాతమువఱకును నౌత్కల లేక యౌడ్రాపభ్రంశముండెను. దాని నుండియే నేటి ఒఱియాభాష జనించినది. ఔడ్రభాష కుత్తరముగ కాశివఱకును మగథాపభ్రంశముండెను. దీనినుండియే నేటి బిహారీభాష పుట్టినది. బిహారీభాషాంతర్భేదమైన 'మగహ' భాష పూర్వపు మాగధీభాషను స్మరింపజేయుచున్నది. మాగధీభాషకు దూర్పుగ బ్రాచ్యాపభ్రంశముండెను. ఇది నేటి బంగాలీభాషకు మూలము. ఈభాషయే యుత్తరముగ వ్యాపించి నేటి యస్సామీభాషగా బరిణమించినది. అర్థమాగధికి సంబంధించిన యపభ్రంశమునుండి నేటి తూర్పుహిందీభాష కలిగినది ఇంతకుముందు పేర్కొనిన