పుట:Andhra bhasha charitramu part 1.pdf/103

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

రేఫముగను, త్మయను సంయుక్తాక్షరము తకారముగను మాఱుటయు, సంయుక్తాక్షరము దాని సంయుక్తతను బాపినపిదప దాని వెనుకనున్న హ్రస్వాచ్చు అట్లే నిలచి యుండుటయు వాని ప్రత్యేక లక్షణములలో జేరినవి. ఐరేనియను భాషలలో 'స్మ' యనునది 'హ్మ' గా మాఱగా నార్యభాషలయందు 'స్మ' గానే నిలచి పోయినది. ఈపిశాచభాషలం ఐరేనియను భాషయొక్కగాని ఇండో-ఆర్యభాషల యొక్కగాని సంపూర్ణ లక్షణములులేవు. కావున నవి ప్రాచీనార్య భాషనుండి విడబడునాటి కిండో-ఆర్యభాషలు ప్రత్యేకముగ విడి యుండెననియు, బ్రాచీ నార్యభాష యప్పటికే యైరేనియను భాషామార్గమున బరిణామము నొందెననియు గాని యా పరిణామ మైరేనియను భాషా లక్షణములన్నియు గలుగు నంతవఱకు జరుగలేదనియు నిండో-ఆర్యులు కాబూలు నదీ ప్రాంతములకు బయలుదేరునప్పుడుండిన భాషాలక్షణముల గొన్నిటిని నిలుపుకొని యుండవనియు నూహింపవలసి యున్నది. అనగా దొల్లింటి యార్యభాషనుండి ఇండో-ఆర్యభాషలు విడబడినవి. మఱి కొంతకాలమునకు దర్దిరుభాషలు ప్రత్యేకమైనవి. తొల్లిటి యార్యభాషయే తిన్నగ బరిణామము నొందుచు వైరేనియను భాషయైనది.

ఇండో-ఆర్యులు హిందూకుష్పర్వతములను పడుమటి కనుమలద్వారా దాటిరి. కాబూలు నదీమార్గమున వా రిండియా లోనికి బ్రవేశించునప్పుడిప్పటి చిత్రాల్, గిల్గిత్ అనుదేశములు, అనగా దర్గిస్థానము వారికెడమ ప్రక్క నుండిపోయెను. హిందూకుష్పర్వతముల మీదుగ జిత్రాలుదేశమునకు సరిగ నుత్తరమున నామీరు పర్వతము లున్నవి. ఈ ప్రాంతమునందే ఘల్యహ్ భాషలున్నవి. దర్దిక్ భాషలకన్న ఐరేనియను లక్షణములన్నియు ఘల్యహ్ భాషలకును గలవు. ఈ ఐరేనియను ఘల్యహ్ భాషలకును ఇండో-ఆర్యభాషలకును సమానములగు లక్షణములు కొన్ని ఐరేనియను భాషయందు గానరావు, కావున దర్దిక్ జాతులవారి పూర్వికులు 'దోర' మొదలగు కనుమలద్వారా నేటి తమ వాసస్థానమున జేరిన ట్లూహింపవలసియున్నది.

ఇట్లు దర్దిక్ జాతులవారు నేటి తమపర్వత వాసస్థానమును జేరిన తఱువాత వారిభాష సొంత మార్గమున మాఱుచు నిండో-ఆర్య, ఐరేనియను భాషలకు విలక్షణమైన రూపమును బొందెను. వారిదేశము పర్వతాక్రాంతమై ఫలవంతము కాకపోవుటచే దానినెవ్వరునుజొరకయుండిరి. క్రీస్తు పూర్వము 327 వ సంవత్సరమున నలెగ్జాండరు, క్రీస్తుశకము 1398 వ సంవత్సరమున తైమూరును తమసైన్యములతో నాదేశము మీదుగ నిండియాకు బోయినప్పుడు తప్ప మఱి యెన్నడును వీరిజోలికి పోయినవారు లేకుండిరి. ఇండియా దేశములోని ప్రాకృతభాషలు శీఘ్రముగ మాఱుచు గ్రొత్త