ప్రకృత గ్రంధములో కళా ప్రపూర్ణ వేదం వెంకటరాయశాస్త్రులవారీ గ్రాంధికాంధ్రభాషా పాండిత్యమును శ్రీ రామమూర్తిపంతులుగారు విమర్శించినారు. తెలుగుపండితులలో అగ్రగణ్యు లైన వీరి భావ దోషభూయిష్టముగా ఉన్నదని ఋజువుచేస్తే గ్రాంథికాంధ్రము నిర్దుష్టముగా వ్రాయడము ఎంతటి పండితులకయినా అసాధ్య మని బోధపడుతుంది; ప్రజలు కృతక భాషావ్యామోహమును పరిత్యజిస్తారు.
ఇందులో ఆంధ్రపండిత భిషక్కుల భాషా భేషజమనీ, మిథ్యాపవాదమనీ రెండు వ్యాసములు ఉన్నవి. మొదటిది పంతులుగారు ప్రకటించిన ’తెలుగు' పత్రిక నుంచిన్నీ, రెండోది ఏలూరిపాటి రామభద్రచయనులు గారు ప్రకటించిన 'సారస్వత సర్వస్వము' నుంచిన్నీ పునర్ముద్రితములు.
జన్మదినోత్సవనిర్వాహక సంఘమువారి కోరిక పైని భాషాపోషకులూ, ఉదారహృదయులూ శ్రీ దేశోద్ధారక కాశీనాధుని నాగేశ్వరరావు పంతులు గారు ఈ గ్రంధము ఉచితముగా ముద్రించి ఇచ్చి గొప్ప సహాయము చేసి నందుకు ఈ సంఘముపకమున వారికి కృతజ్ఞతతో వందనము లర్పిస్తున్నాను. ఈ గ్రంథము ఫ్రూఫులు ఓపికతో దిద్ది నా కత్యంత సాహాయ్యము చేసినవారు శ్రీ రామమూర్తి పంతులుగారి శిష్యకోటిలో ప్రధానులూ, సహృదయులూ, నాకు గురుతుల్యులూ అయిన శ్రీ కాళ్లకూరి సూర్యనారాయణపంతులుగారు. వారికి నాహృదయపూర్వక ప్రణామములు.
జన్మదినోత్సవ సంఘమువారికి శ్రీ పంతులుగారు తమ రచనలు ప్రకటనార్థము ఇచ్చినందుకు వారికి ఈ సంఘముతరపున కృతజ్ఞతాపూర్వక వందనములు సమర్పిస్తున్నాను.
తెలికిచెర్ల వెంకటరత్నం,
సంపాదకుడు.