గ్రంథాలయ సూక్తులు
'మధురకవి' శ్రీ నాళము కృష్ణ రావు
గ్రంథములు
కలఁత లడఁగించు, కష్టముల్ తొలఁగఁ ద్రోయు,
పాపములఁ బాపు బన్నముల్ పాఱఁద్రోలు,
మాంద్యమును మాన్చు, దుఃఖముల్ మఱవఁజేయు;
కావ్యములు మానవుల పాలి కల్పలతలు.
కావ్యములు కావ్యమాత్రముల్ కావు తలఁప
అవి పురాతన ప్రస్తుత భవితృకాల
మానవుల జీవితంబుల మానసముల
భావములు నాశయంబుల వ్యక్తపఱచు.
తరములనుబట్టి విబుధులు దాచియున్న
జ్ఞానభండారములు గ్రంథసంపుటములు
ధరణి వెలసినయందాక తఱుగఁబోని
వారసత్వపు హక్కులై వఱలు మనకు.
సృష్టి మొదలుగ మసుజు లార్జించినట్టి
నిస్తులం బగు మాన్యముల్ పుస్తకములు;
సతము నద్గ్రంథపఠనంబు కతనఁ గాదె
పృథివి నాగరికత జెంది వృద్ధి గాంచు.
అమిత ధనధాన్యభాగ్య భోగముల కన్న
అమల వాఙ్మయ రామణీయకము ఘనము;
శేముషీవంతుల పవిత్ర జీవిత ప్ర
శస్త రక్తపుంజంబులు పుస్తకములు.
పుస్తకంబులు గలిగిన పూరిగుడిసె
యందు నిఱుపేదకాపు నై యుందుఁ గాని,
పుస్తకంబులు లేనట్టి భూరిసౌధ
మందు చక్రవర్తిగ నుండ నభిలషింప.