ఇతరసంఘముల సంబంధము
లోగడ నీసంఘము 'ఇండియ౯ లైబ్రరీ అసోసియేష౯' లో సభ్యత్వము కలిగియుండెను. కాని మధ్య కొంతకాలము చందా చెల్లించని కారణమున మన సభ్యత్వము రద్దు చేయబడెను. తిరిగి నెల కిందటనే ఈసంఘమున మన సభ్యత్వమును పునరుద్ధరించు కొంటిమి.
'బెంగాల్ లైబ్రరీ అసోసియేష౯' వారు రెండేండ్లనుండి మన ప్రచురములను తమకు బంపు నేర్పాటుతో వారి ప్రచురములను మనకు బంపుచున్నారు. మన సంఘాధ్యక్షులగు శ్రీ గాడిచర్ల హరిసర్వోత్తమరావుగారు, దక్షిణ భారత వయోజనవిద్యా సంఘమునకు రెండేండ్లకు పైగ ఉపాధ్యక్షులుగనుండి దాని కార్యక్రమమునకు చాలగ తోడ్పడుచువచ్చిరి.
గ్రంథాలయ శిక్షణ
గ్రంథాలయోద్యమము పరిపూర్ణముగ వ్యాప్తిగాంచకుండుటకు గల ముఖ్యకారణము గ్రంధాలయముల నడపువారు తదభివృద్ధి కనుకూలించుపద్ధతుల గుర్తెఱుగ కుండుటయే. చదువు నేర్చిన యువకులును యువతులును గ్రంథాలయ నిర్వహణమున శిక్షణను బొంది సేవాలక్ష్యముతో పనిచేయుచో మన యుద్యమము చక్కగ నడచుటకును త్వరత్వరగ అభివృద్ధి చెందుటకును అవకాశములు చాలగ గలవు. అగుటచే ఈ సంవత్సరము మే మాసములో గ్రంధాలయ శిక్షణ తరగతుల నేర్పాటు చేసి గ్రంథాలయ సేవకులకు తరిబీయతు నిచ్చుటకై ఆలోచించు చున్నాము.
సలహా కేంద్రము — కార్యాలయ ప్రయత్నము
'ఆంధ్రగ్రంథాలయం' ద్వారాను, పైశిక్షణ తరగతులమూలమునను గ్రంధాలయ నిర్వహణనుగూర్చిన సమాచారములను విరివిగ ప్రచారము చేసినను వ్యక్తిగతముగ గ్రంథాలయములకు అవసరమైన సలహాల నెప్పటికప్పుడు తెలియ జేయవలసిన ఆవశ్యకత యెంతయో గలదు. గ్రంథాలయ నిర్వహణ సమస్యలనేగాక విజ్ఞాన సంబంధమైన అనేక విషయములను గూర్చి గ్రంథాలయ సేవకులును, విజ్ఞాన పిపాసులును కోరెడి సమాచారములుకూడ నంద జేయవలసిన విధి మనపై గలదు. అగుటచే నీసంఘము ఇట్టి సలహాలనిచ్చు కేంద్రముగ పనిచేయవలసియుండును. ఈ సలహానొసంగవలెనన్న విజ్ఞాన సాధనములకు గ్రంధములు బహుళముగ కావలసియుండును. వీనినన్నిటిని సేకరించి భద్రపఱచుటకు చక్కని వసతులుండవలెను. ఈ విజ్ఞాన సామగ్రి నుపయోగములో పెట్టి కోరినవారి కెప్పటికప్పుడు సలహాలిచ్చుటకై సమర్ధుడగు నొక గ్రంథాలయ సేవకుడు మనకు లభించవలెను.