కృష్ణా, గుంటూరు జిల్లాలలో జిల్లా మహాసభలును, - తాడేపల్లిగూడెం, నరసాపురం, దివి, బెజవాడ, నందిగామ, తెనాలి, గుంటూరు, సత్తెనపల్లి, నరసరావుపేట, పల్నాడు, బాపట్ల, ఒంగోలు తాలూకాలలో తాలూకా మహాసభలును, బందరు, గుడివాడ పట్టణములలో పట్టణమహాసభలును నివేదికకాలములో జరిగినవి. మఱియు దీనిశాఖలుగనున్న కొన్ని తాలూకా సంఘములు తమతమ తాలూకాలలో గ్రంధాలయయాత్రలద్వారా చక్కని ప్రబోధమును గావించి నూతనగ్రంధాలయాల స్థాపించుటకును, ఉన్నవి చక్కగ పని చేయుటకును తోడుపడినవి.
అయితే ఉద్యమప్రచారాని కనుకూలించే ముఖ్యసాధనమైన పత్రికానిర్వహణం విషయంలో కొంతపని జరిగినదని చెప్పుటకు సంతసమగుచున్నది. ఇంతకు పూర్వం 'గ్రంధాలయసర్వస్వము' అనేపేరుతో సాగింపబడిన సంఘపత్రిక 'ఆంధ్రగ్రంధాలయం' అనేపేరుతో పునరుద్ధరింపబడి (1939 సం॥ సెప్టెంబరులో) 1940 సం॥ జూన్ నాటికెట్లో 1 సంవత్సర జీవితాన్ని ముగించుకొన్నది. ఈపత్రిక ఆంధ్రాంగ్లములలో చక్కని వ్యాసములను సంపాదకీయములను ప్రకటించి ముచ్చటనుగొల్పు ఆకారము తోను ఆకర్షణీయమైన పటములతోను నొప్పారుచు పలువురు పెద్దల ప్రశంసలను కూడ బడసియు తగిన ఆదరము లేక ఆర్థిక పుటిబ్బందులకు లోనగుచున్నది. ఈచిక్కు తొలగవలెనన్న గ్రంథాలయముల నిర్వాహకులు, ఉద్యమాభిమానులు పత్రికకు చందాదారులుగ చేరియు, విరివిగ విరాళముల నొసగియు బాగుగ తోడ్పడవలెను. ఈ పత్రికకు సంపాదకులుగ నుండి దీనినిర్వహణకు తోడుపడిన శ్రీ పుణ్యమూర్తుల రాజ శేఖరంగారికిని, ప్రచురణకర్తలు శ్రీ అడుసుమల్లి శ్రీనివాసరావుగారికిని మా కృతజ్ఞతాపూర్వక నమస్కారములు,
సంఘప్రచురములు
నివేదిక కాలములో నీ సంఘపక్షమున 1939-40, 1940_41 సం॥ల కార్యనివేదికలు, ఆంధ్రదేశ గ్రంధాలయముల పట్టిక, గ్రంధవివరణ పట్టికలు, డాక్టరు కట్టమంచి రామలింగారెడ్డిగారి 'ముసలమ్మ మరణము' అను పద్యకావ్యము మాత్రము ప్రకటింపబడినివి. సంఘాధ్యక్షులు శ్రీ గాడిచర్ల హరిసర్వోత్తమరావుగారిచే తయారు చేయబడిన వయోజనవిద్య-మొదటి వాచకము అచ్చునకు సిద్ధముగ నున్నది. గ్రంధాలయముల కవసరమైన అన్నిరకముల రిజిస్టర్లు వ్రాసియిచ్చుచో వీని ప్రకటనకు తగిన యేర్పాట్లను గావించుటకు మిత్రులొకరంగీకరించియున్నారు.
ఇవిగాక గ్రంధాలయములకు సంబంధించిన వాఙ్మయమును, స్త్రీలకు, పిల్లలకు, వయోజనులకు అనుకూలించు సారస్వతమును ప్రచురించు విషయమై కూడ మేమాలోచించుచున్నాము. ఉదారుల సహాయము, రచయితల తోడ్పాటు మాకు లభించుచో ఈ మా సంకల్పము త్వరలోనే సిద్ధించగలదు.