Jump to content

పుట:Andhra Granthalayam 1941 01,04 01 Volume No 02 Issue No 01,02.pdf/45

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

అటుకానిచో, అలెగ్జాండరు దండెత్తివచ్చి తిరిగి పోవునపుడు పొత్తము లెన్నో యిక్కడనుండి ఎట్లు పోయియుండును? అప్పటికి - ౨,౸౬౪ ఏండ్లక్రిందట - సంస్కృతపువ్రాగమి మిఁటి కొప్పంటుకొనెడి ఉనికి వచ్చుచుండె.

తత్త్వబోధలు, పురాణపఠనము, గ్రామస్వరాజ్యపద్ధతుల చర్చలు మొదలగు వానివలన చదువురాని వారును ఎఱుకగలవారగుచుండిరి.

బౌద్ధజైనులు, పాలివ్రాగమియు - ప్రాకృతవాఙ్మయమును పెంపొందించిరి. కానీ వారికిని పొ.గుడులు ఉండెనని వేరే చెప్పనక్కఱలేదు. తమిళనాటిలో తమిళవాగ్రమి పెరుఁగుటచే అక్కడును పొ.గుడులు వెలయుచుండెననియే తలంపనగు.

రాజులును, రాజబంధువులును, పండితులును, ఒజ్జలును, పొ.గుడులు కూర్చెడివారు. బౌద్ధ సన్న్యాసులకు మతగ్రంథములు వ్రాయుట విధి; జైన భిషిక్తులకును పొత్తములు కాపాడుట విధి. ఇందు వలన నగరి పొ.గుడులు, గుడి పొ.గుడులు, విహారగ్రంధాలయములు, మఠగ్రంధాలయములు, గుహా గ్రంధాలయములు, పండితుల పొ.గుడులు మొదలగునవి వెలసినవి.

తక్కిన పొ.గుడులకంటె విశ్వవిద్యాలయ పీఠముల పొ.గుడులు మిక్కిలి పేరుపొందినవి.

నలంద - ఇందలి విద్యాపీఠమునకు ఆసియాలోని అన్ని దేశములనుండియు విద్యార్థులు వచ్చెడి వారు. అక్కడ 'రత్నోదధి' — అను మేటి పొ.గు. ౮ అంతస్తుల మేడపై వెలయు చుండెడిది. హ్యూన్ త్సాంగ్ –ఆను చీనా యాత్రికుఁడు ౬౫౭ వచ్చి, చదువుకొని, కావలసిన పొత్తములు పెక్కులు వ్రాసికొని, తీసికొని పోయినాఁడు. అట్టి పొ.గు.బౌద్ధభిక్షుకులు తమలోతాము దెబ్బలాడుకొని, మంటలపాలు చేసినారఁట! ఇంతకంటె మొఱకుతనమునకు తార్కాణ ఏమి కావలె?

తక్షశిల — ౬ శతాబ్దిని ఇందలి విద్యాపీఠమున ౧౮ విద్యలును నేర్పెడివారు; అచ్చటికి యూరపు వారు పెక్కురువచ్చి చదువుకొనుచుండిరి. ఆట్టిచో అక్కడ ఎట్టి మంచి పొ.గు.ఉండెడిదో!

ఉదంతపురి - నలందలో విద్యాపీఠము క్షీణించునపుడు మగధరాజు దీనిలో విద్యాపీఠ మేర్పరిచె. ఇందలి పొ.గుడి ౧౨౦౨ లో భక్తియార్ ఖిల్జీ బీహారు దేశము మీఁదికి దండెత్తివచ్చినపుడు కాల్పించే. ఇచ్చటి కొన్ని పొత్తములు నేపాళము చేరినవి.

విక్రమశిల — ఇక్కడకూడ ఉదంతపురియందు వలెనే విద్యాపీఠమును, గ్రంథాలయమును ఏర్పడి వానివలెనే పోయినవి. ఇందలి పొత్తములు కొన్ని టిబెట్టు దేశము చేరినవి.

దూపొంగ – ఇందలి విద్యాపీఠ గ్రంధాలయము బౌద్దులకు ఎంతయు పనికివచ్చుచుండే.

పాటలీపుత్రము- ఇచ్చటి విద్యాపీఠమున మంచి పొ.గు.ఉండెడిది. అందు చీనా యాత్రికుఁడగు పాహియాను 3 ఏండ్లుండి, సంస్కృతమును బౌద్ధమతగ్రంథములును చదువుకొని, కావలసిన పొత్తములు పెక్కులు వ్రాసికొనిపోయె.

కాశి - ఇది గొప్ప విద్యాపీఠము. ఇందు అన్ని విద్యలు నేర్పు మహా పండితులుండెడివారు. ఇట్టిచో పొ.గుడులుండకున్న మఱి యెక్కడఉండును?

కంచి - ద్రవిడ దేశమున రాజధానిగాఉండి పేరుపొందిన యీనగరమున మంచి విశ్వకళాశాల ఉండెడిది. కాన, దానితోపాటు మంచి పొ.గుడియు ఉండుట నిశ్చయమే.

మధుర – ఇవి పాండ్యదేశరాజధాని. దీనిలో పండిత సంఘముండి, తమిళపొత్తములను పరికించు చుండెడిది. కావున ఇందు పొ.గుడి వెలయుచుండుటలో వింతలేదు.

చీనాయాత్రికులవలెనే ఆయా విద్యాపీఠములలో చదువుకొని వచ్చినవారు పలువురు తమకు కావలసిన పొత్తముల కెల్ల నకళ్ళు వ్రాసికొని తమనాడులకు కొనిపోయి, అక్కడ ఎఱుక పెంపొంద చేసికొనుచుండిరి.