Jump to content

పుట:Andhra Granthalayam 1941 01,04 01 Volume No 02 Issue No 01,02.pdf/25

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

జిల్లాబోర్డు గ్రహించిననాడే ప్రత్యేక వ్యక్తులు చేయు ప్రచారసహకారములకంటె ప్రత్యేకవ్యక్తులు ననేకరెట్లధికముగా గ్రంథాలయములు అభివృద్ధిపొందుట కవకాశము కలుగగలదని నమ్ముచున్నాను. దేశములో దాతలు చాలామంది ధర్మసత్రములు నిర్మించి దేశోపకారము చేయుచున్నారు. అట్టి దాతల చేతనే ఆ సత్రములలో కొంత భాగమును గ్రంధాలయముల నెలకొల్పుటకు వినియోగింపవలసినదిగా మనము వారిని ప్రోత్సహించవలసియున్నది.

దేశమునందలియు విదేశాలయందలియు రాజకీయ పరిస్థితులు మారిపోయి, నాగరికత యొకమూల నిర్మూలమును మరియొక ప్రక్క నిర్మాణమును జరుగుచున్న యీ రోజులలో, దూరశ్రవణ దూరదర్శన యంత్రములు విలసిల్లుచున్న యీదినములలో, మనదేశమున కొంతవరకైన వాటిసహాయమును పొంది వాటిద్వారా విజ్ఞానవ్యాప్తికి పాటుపడవలసిన యవసరమెంతేని కలదు. కాబట్టి సాధ్యమైనంత వరకు గ్రంథాలయములలో రేడియోయంత్రములు నెలకొలిపి తద్వారా స్వదేశ విదేశములయందు జరుగుచున్న కార్యకలాపములు దెలుసుకొనవలసినదనియు, రేడియోసెట్లను ధనవతులు దానపూర్వకముగా నొసంగునట్లు వారిని ప్రోత్సహింపవలసియున్న దనియు మనవి చేయుచున్నాను.

గ్రంథాలయోపయోగములను చెప్పవలెనన్న సంవత్సరములకొలది చెప్పవచ్చును. దాదాపుగా ముప్పది సంవత్సరముల నుండి సాగించుచున్న యీ యుద్యమముయొక్క యుపయోగములనుగూర్చియు ప్రాముఖ్యతను గూర్చియు చెప్పు కొనుచునే యుంటిమి. ఈ చెప్పుటతో తృప్తిచెందక ప్రతి యొక్కరు ఒక గ్రంథాలయమునైనను స్థాపించి, దాని యుపయోగములను గ్రామీయులచే అనుభవింప జేసిననాడే మన గ్రంధాలయ సేవకులు ధన్యులయ్యెదరని మనవి చేయుచున్నాను.

గ్రంథాలయముల పాలన, నిర్మాణము, వ్యాపకము మున్నగు వివిధవిషయములను గూర్చి నాకంటె యనేక విధముల అనుభవజ్ఞులును పూజ్యులు నగు నేటి సభాధ్యక్షులు శ్రీరామచంద్రకవిగారు మున్నగు మహామహు లెందరో విపులముగా నుపన్యసింపనున్నారు. ఈ గ్రంథాలయోద్యమమునకును నేడు షష్టిపూర్తి మహోత్సవము జరుపబడుచున్న శ్రీకృష్ణ రాయలయొక్క జీవిత చరిత్రమునకును అవినాభావసంబంధముండుటవలన యిట్టి ఆనందసమయమున నీ ఆంధ్రదేశ గ్రంథాలయ సభ కూడ జరుపుచుండు టెంతయు బాగుగానున్నది. నాకీ గౌరవమును కలుగ జేసినందులకు గ్రంధాలయ సంఘము వారికి నా నా మనఃపూర్వక వందనముల నందజేయు చున్నాను.

నిడదవోలు వెంకట్రావు