Jump to content

పుట:Andhra Granthalayam 1941 01,04 01 Volume No 02 Issue No 01,02.pdf/22

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

గ్రంథాలయ యాత్రలు సాగించి గ్రంథాలయ ఉద్యమవ్యాప్తికి తోడ్పడవలెను. మరియు యాత్రలందు సమీపమునగల పురాతన చారిత్రక ప్రదేశములు దర్శించి అందలివి శేషముల రికార్డు చేయుటయు, తాళపత్రగ్రంధముల సేకరించుటయు, వానిని కేంద్ర గ్రంథాలయ భవనములందు భద్రపరచుటయు జరుగవలెను. యాత్రావిశేషములను పత్రికలయందు ప్రచురణ చేయించు చుండవలెను.

ప్రతి గ్రంధాలయమువారును ఆంధ్రదేశ గ్రంధాలయ సంఘమందు సభ్యత్వమునుపొంది ఆదర్శప్రాయమగు కట్టుబాట్లతో గ్రంధాలయోద్యమమును కొనసాగించవలెను. దీపావళి సంక్రాంతి భిక్షులకు బయలుదేరి గ్రంథాలయమునకు మూల ధనమును చేకూర్చి తద్వారా ప్రతి గ్రంథాలయమునకు స్వంతభవనమును నిర్మించవలెను. గ్రంధాలయముగల గ్రామముయొక్క వివరమును వ్రాయించి వచ్చు వారికి కనబడునటులు గ్రంధాలయ భవనమున ప్రదర్శించవలెను. గ్రామప్రజలకు దేశభాషాజ్ఞానమును, పిమ్మట ఇతర భాషా పరిచయమును, జీవితానంద సంధాయకములగు కళలందును, స్వతంత్ర జీవనాధారంబులగు పరిశ్రమలయందును అభిరుచిని కలిగించవలెను.

ప్రజలు

గ్రంథాలయనిర్వహణమున ప్రజలు కూడ భాగస్వాములే. వారికి అవకాశము కలిగినపుడు కాలమును వృధాపుచ్చక గ్రంధాలయమునకు వచ్చి పత్రికాపఠనమును, సద్గ్రంధపఠనమును చేయుచుండవలెను. గ్రంథాలయమందు జరుగు ప్రతి సభకు హాజరగుచుండవలెను. వారివారి గ్రామములయందలి ఉన్నత భవనములకు మిన్నయగు ఆలయమును శ్రీశారదాదేవికి నిర్మించవలెను. అందరు చందాదారు లుగా చేరియు, విరాళములు సమృద్ధిగ నొసగియు, గ్రంథాలయ సేవజేసియు జీవితముల సార్ధకము చేసికొనవలెను.

గ్రంథాలయ సేవకులు

మన తెలుగు దేశమందలి గ్రంధాలయ సేవకులందరూ సంవత్సరమున కొకసారి అయినను ఉద్యమవ్యాప్తికి అర్హమగు వేరు వేరు ప్రదేశములందు సమావేశమై వారి వారి అనుభవములను ఒకరికొకరు “బోధయ స్తః పరస్పరమ్" అను న్యాయానుసారము తెలుపుకుంటూ మనదేశమందలి అన్ని గ్రంథాలయములయందు ఒకే మోస్తరు రిజిస్టర్లు ఉంచి ఆంధ్రదేశ గ్రంథాలయ సంఘమందు ప్రతి గ్రంథాలయమును చేర్చి సక్రమమార్గమున ఉద్యమవ్యాప్తిగావించి తద్వారా ప్రజలలో విజ్ఞానమును వెదజల్లి తమవిధులను నిర్వర్తించుచుందురుగాక యని ప్రార్ధించుచు ముగించుచున్నాడను.

గ్రంథాలయోద్యమవ్యాప్తిమూలమున ధర్మయుగస్థాపనకు భగవాను డనుకూలించుగాక !