Jump to content

పుట:Andhra Granthalayam 1941 01,04 01 Volume No 02 Issue No 01,02.pdf/15

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

కును అడగమంటుంది. ఈవిధంగా ఒకరినిబట్టి ఒకరిని అడుగుతూ పోయింది. చిట్టచివరికి ఈగ గుర్రంకడుపులో పిల్లదగ్గిరికి వెళ్ళి అడుగుతుంది. ఏమనీ_పేదరాసి పెద్దమ్మా, పెద్దమ్మ కొడకా, కొడుకు చేతిలో గొడ్డలీ, గొడ్డలికొట్టేమానా, మాను మీదుండే పక్షుల్లారా, పక్షులుతాగే నీళ్ళల్లారా, నీళ్ల లో వుండే చేపల్లారా, పట్టే పల్లెవాడా, వండే వంటలక్కా, తినేరాజా, రాజెక్కే గుర్రమా, గుర్రంకడుపులో పిల్లా, నాపేరేమిటీఅని. గుర్రం పిల్ల నవ్వుతుంది. __ ఈ ఈ ఈ అని. అప్పుడు ఈగకు తన పేరు జ్ఞాపకం వస్తుంది. ఈగకు ప్రాచీన రూపం "ఈ" అని పరిశోధకులు చెప్పుతారు. ఒకమారు పిల్లవాడు ఇట్టికధ వింటే ఇక మరచిపోడు.

బాలవాఙ్మయం కర్త తల్లి హృదయం

బాలవాఙ్మయంలో చాలా పాటలకూ కధలకూ తల్లిహృదయమే కర్తృత్వం వహిస్తుంది. ఒక్కొక్క పట్టున బాలుర ఊహాశక్తి లయ జ్ఞానముకూడా కారణమై ఉండవచ్చు. మరిన్నీ బాల్యముకోల్పోని కవుల కల్పనాశక్తికూడా యిందుకు కారణమై ఉండవచ్చును.

ఇట్టి ప్రాచీనవాఙ్మయాన్ని పునరుద్ధరించి పాఠశాలలో ప్రవేశపెట్టవలసియున్నది. ఇంతేకాకుండా దీని ననుసరించి నూతన వాఙ్మయసృష్టికూడా జరగవలసియున్నది. బాలవాఙ్మయానికి తగిన వస్తువు దొరకదేమోనని మనము భయపడనక్కర లేదు. పురాణపురుషులు పెక్కురు బాలురు మనకున్నారు. వారి బాల్యచరిత్రలు కధా వస్తువుగా మనము గ్రహింపవచ్చును.

అధిష్ఠానదేవత బాలకృష్ణుడు

బాలవాఙ్మయానికి అధిష్ఠానదేవత బాలకృష్ణుడు. తెలుగుదేశంలో బాలవాఙ్మయం కొంతవరకు బాలకృష్ణ క్రీడలపై ఆధారపడిఉన్నది. జోలలూ, మేలుకొలుపులూ, ఆటలూ, పాటలూ, కొంటెపనులు వర్ణించే కధలూ, గేయాలూ, బాలకృష్ణుణ్ణి ఉద్దేశించినవి పెక్కులున్నవి.

మిగిలిన బాల వీరులు-ధ్రువుడు, ప్రహ్లాదుడు, చిరకారి, మార్కండేయుడు. రాముడు, బలరాముడు, పరశురాముడు, వామనుడు మొదలయినవాళ్లు ఉన్నారు. ఉచితమైన బాల భాషలో వీరి చరిత్రలు వ్రాస్తే బాలవాఙ్మయం కొంత ఏర్పడుతుంది.

సూరి, నీతి, వెంకీ కథ

మరిన్నీ, ఇతర దేశపు బాలవాఙ్మయాలతో మనము ఈ కాలంలో పరిచయము సులభముగా సంపాదించవచ్చు. స్టీవెన్ సన్, హాధారన్, గ్రిమ్, ఆండర్ సన్ మున్నగువారు వ్రాసిన కధలూ, స్టెడ్ పుస్తకములు మనము ఆదర్శప్రాయంగా వుంచుకొని మనవాఙ్మయాన్ని వృద్ధిచేసికోవచ్చు.