Jump to content

పుట:Andhra Granthalayam 1941 01,04 01 Volume No 02 Issue No 01,02.pdf/10

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

గ్రంథనిలయంబు లేని స్వర్గంబునందు
నిముస మైనను నివసింప నిచ్చగింప.

దేవళంబులు సత్రముల్ సోవడులును
చెఱువులును వీట లేకున్న కోఱఁత లేదు;
దివ్య మగు నొక్క గ్రంథమందిరము లేని
వీడు వీడు గా దది పాడుబీడు గాని.

గ్రంథనిలయంబునందలి గ్రంథములకు
గుణమె కాని ప్రధానము, గణము కాదు
ఎన్నియో చెత్తపొత్తము లున్నకన్న
ఉత్తమగ్రంథములు కొన్ని యున్న చాలు.

ఏను గ్రంథాలయంబున కేగినపుడు,
గ్రంథములు నాకు కన్పట్టు కనులయెదుట
ఉర్విజనులకు బోధించి యుద్ధరింప
వేడ్క దివినుండి వచ్చిన విబుధులనఁగ.