పుట:AndhraRachaitaluVol1.djvu/532

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

అడివి బాపిరాజు

1895

నియోగి బ్రాహ్మణులు. తల్లి: సుబ్బమ్మ. తండ్రి: కృష్ణయ్య. జన్మస్థానము: భీమవరము. జననము: 8 అక్టోబరు 1895 సం. రచనలు: 1. నారాయణరావు 2. హిమబిందు 3. తుపాను 4. కోనంగి. 5. గోనగన్నారెడ్డి. 6. అడివి శాంతిశ్రీ 7. మధురవాణి (ఇత్యాదులు నవలలు) 8. అంజలి. 9. రాగమాలిక. 10. తరంగిణి (ఇత్యాదులు కథలు) 11. తొలకరి 12. హారతి. 13. గోధూళి (ఇత్యాదులు పాటల సంపుటములు) 14. తీర్థయాత్ర. (వ్యాస సంపుటము.) 1. ఆంధ్రసామ్రాజ్ఞఇ. 2. కృతిసమర్పణం. 3. భగీరధీలోయ 4. దుక్కిటెద్దులు. 5. ఉషాసుందరి. (ఇత్యాదులు రేడియో నాటికలు.)

శ్రీ బాపిరాజుగారు కళాప్రపూర్ణులు. ఈ బిరుదము విశ్వవిద్యాలయ ప్రసాదము వలన జేకూరినది కాదు. అసలు, సహజముగా నాయన బహు కళాప్రపూర్ణులు. కవిత్వము, శిల్పము, చిత్రకళ, గానము, నాట్యము మొదలగు నెన్నో కళలలో బాపిరాజుగారు సుపరిణతమైన యెఱుక గలవారు. దేశభక్తి, రచనాశక్తి, యీయనలో మూర్తికట్టుకొని యున్నవి. చరిత్రముపై వీరికి గొప్ప యభిమానము. శాస్త్రములపై మంచి విశ్వాసము. రసార్ద్రమైన హృదయము. తియ్యని పలుకుబడి. ఇన్ని విశిష్ట లక్షణములు గల రసికుడు గ్రంథరచన గావించుచో మరి యవి సుధాభాండములుగా నుండవా ?

పాశ్చాత్య సారస్వతమునను, ప్రాచ్య సాహిత్యమునను సమానముగానే వీరు పరిశ్రమించినవారు కావున, ఆయన కృతులలో సంప్రదాయ సిద్ధమైన సౌందర్యము, వింత కలిగించు క్రొత్తపోకడలు కూడ నుండును. ఈయన ' శశిబాల ' నుపాసించును. గోదావరి, యనగా బాపిరాజుగారి కెంతో యాప్యాయము. ఈకవి చిక్కని పాటలు వ్రాయును; చక్కగా బాడును.