ప్లీడరుపని చేసిరనగా, ప్రతాపరెడ్డిగారి కాభాషలోని ప్రవేశమెంతటిదో తెలియగలదు. 'పార్శీ' యందును వీరి సరిశ్రమము ప్రశంసనీయమైనది. మొత్తముమీద సంస్కృతము, ఉర్దూ, పార్శీ, ఆంధ్రము, ఆంగ్లము - భాషలలో జక్కని పరిచయము ప్రతాపరెడ్డిగారి కున్న యది. ఇట్టి విజ్ఞతలతో నీయన సారస్వతోద్యోగము నిర్వహించుచున్నారు. రాజకీయోద్యోగములు కోరిన మానిసి కాకపోవుటచే ప్రతాపరెడ్డి లక్షలకధికారి కాలేకపోయెను. పోనిండు! ఆయన గ్రంథములు నేనవేలు విలువకలవి కావచ్చును.
నిండుగా నిరువది నాలుగేండ్లు ప్రతాపరెడ్డిగారు నెఱపిన మహోద్యోగ మొక డున్నది. అది "గోలకొండ" పత్త్రికాసంపాదత. వీరి యధికారములో 'గోలకొండ' అర్ధవార పత్త్రికయై మంచి ప్రఖ్యాతి ప్రచారములు పడసివచ్చినది. ఇటు లుండగా 'లిమిటెడ్ కంపెనీ' వారు వచ్చి దానిని దినపత్త్రికగా మార్పుచేసి నడపుచున్నారు. కారణాంతరములచే వారితో గుదురక రెడ్డిగారు సంపాదకత వదలుకొని 'ఇటికాలపాడు' అను గ్రామములో బ్రకృతము గడపుచున్నారు.
చరిత్ర, పరిశోధనము - అనగా వీరి కెంతో సంబరము. వీరియిల్లు చరిత్ర భాండారమని చెప్ప విందుము. ప్రతాపరెడ్డిగారి కథలు, సారస్వత వ్యాసములు, చరిత్ర, పరిశోధన రచనలు మొత్తము మున్నూఱు సంఖ్యకు బైపడియున్నది. నాటకములువ్రాసిరి. పద్యరచనచేసిరి. 'ప్రజాధికారములు' మున్నగా నెన్నో రాజకీయ విషయములపై చర్చాగ్రంథములు వెలువఱిచిరి. హైందవ ధర్మవీరులు, రామాయణ విశేషములు, హిందువుల పండుగలు మున్నయిన రెడ్డిగారి కూర్పులు వారి వివిధవిషయజ్ఞతకు నిదర్శనము లైనవి. ఈయన పద్యకవితయు సాధుమధురమైనది. తెనుగు భాషామతల్లిపై వ్రాసిన యీసీసము చూడవలయును: